ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతి విమర్శలు, సవాళ్ల పర్వంలో ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల, హిందూ ఆలయాల్లో విగ్రహాల విధ్వంసాలు.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలు, ఈ తరహా సంఘటనలతో ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. దీనికి తోడు గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు.. అక్కడ పదవులు అనుభవించి చిన్నగా జగన్ గూటి కిందకి చేరుతున్నారు.
టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన చాలామంది నేతలు ఇప్పుడు చంద్రబాబు పై ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీలోకి చేరిపోగా , ఇక ఇప్పుడు ఇదే వరుసలోకి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వచ్చి చేరిపోయారు. నిన్న ఏపి శాసనమండలి వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ ధాఖలు చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతోనే నామినేషన్ వేశానని చెప్పిన ఆమె సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలని జగన్ ఎంతో తాపత్రయ పడుతున్నారని ప్రశంసించారు.
ఇక జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు కోర్టులను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నారంటూ మండిపడ్డారు. చివరకు దేవుడిని కూడా చంద్రబాబు వదలకుండా.. ఆయన్న కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విమర్శించారు.చంద్రబాబు చిల్లర రాజకీయాలతో కుతంత్రాలు చేస్తున్నారన్న సునీత… 20 ఏళ్లు టిడిపిలో పని చేశా ఆ సమయంలో చంద్రబాబు నరకం చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలలకు సిఎం జగన్ నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించారని ఆమె గర్వంగా చెప్పుకున్నారు.