YSRCP Vs Jana Sena : దత్త పుత్రుడు వర్సెస్ దివాళా పుత్రుడు.!

YSRCP Vs Jana Sena

YSRCP Vs Jana Sena : కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దరిమిలా, ఆ కుటుంబాల్ని ఆదుకునేందుకు జనసేన పార్టీ, ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయల చొప్పన ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన వ్యక్తిగత సంపాదన నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాజకీయాల్లో నిజంగానే ఇది సరికొత్త ఒరవడి.

సరే, అధికార వైసీపీ ఎలాగూ పవన్ కళ్యాణ్ చేసే పనుల్ని మెచ్చుకోదు. ప్రభుత్వం ఏకంగా ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా, ఆ సాయం అందక వందలాది రైతన్నల కుటుంబాలు లబోదిబోమంటున్న మాట వాస్తవం కూడా.

తాజాగా, రైతు భరోసా పంపిణీ కోసం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, ‘దత్త పుత్రుడు’ అంటూ జనసేన అధినేత మీద విరుచుకుపడ్డారు. ‘ఆత్మహత్య చేసుకున్న పట్టాదారు పుస్తకం కలిగిన ఒక్క రైతునీ దత్త పుత్రుడు చూపించలేకపోయాడు..’ అంటూ ఎద్దేవా చేశారు.

అసలు ఇలాంటి విషయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు అందిస్తున్నదెవరోగానీ, ముఖ్యమంత్రిని పూర్తిస్థాయిలో పక్కదారి పట్టిస్తున్నారు. బాధిత కుటుంబాలు, పవన్ అందించే సాయం కోసం ఎదురుచూస్తున్న వైనం మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలంటూ బాధితులే లేకపోతే, 30 కోట్లు పవన్ కళ్యాణ్ ఎందుకు ఖర్చు చేస్తారన్న ఇంగితం వైసీపీకి వుడాలి కదా.? అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న విమర్శ.

పవన్ కళ్యాణ్‌ని దత్త పుత్రుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణిస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జగన్ మోసపు రెడ్డిగా, దివాళా పుత్రుడిగా జనసేన శ్రేణులు అభివర్ణిస్తుండడం గమనార్హం.