గతకొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా టీడీపీ నేతలపైనా, పరోక్షంగా చంద్రబాబుపైనా నానీ కీలక వ్యాఖ్యలే చేశారు. దీంతో నానీ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికంతటికీ చంద్రబాబు చేసిన ఒక పనే కారణం అని నానీ వర్గం ఆరోపించేది. నానీని తప్పించడానికి ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేది. ఈ సమయంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవును… తమకు కొక్రకరాని కొయ్యగా మారిన విజయవాడ లోక్ సభా నియోజకవర్గంలో ఈసారి వైసీపీ తరఫున బీసీ అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టు ఒక వార్త పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల తరఫున ఎంపీలుగా గెలిచినవారిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా… 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలవగా… 2014, 2019ల్లో టీడీపీ నుంచి కేశినేని నాని గెలిచారు. వీరిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఇదే సమయంలో వీరి చేతిలో ఓడిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ లు అదే సామాజికవర్గానికి చెందినవారే.
ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు ఆ అభ్యర్థికే పడే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎస్సీ, బీసీలకు అటు మంత్రి పదవుల్లోనూ, ఇటు నామినేటెడ్ పదవుల్లోనూ పెద్ద పీట వేసిన జగన్… తాను ఈ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని భావిస్తున్నారని తెలుస్తుంది.
వైసీపీ సంగతి అలా ఉంటే… 2024లో కూడా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని అంటున్నారు. వీరిలో ప్రధానంగా కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే చిన్నిని నాని ఎట్టిపరిస్థితుల్లో గెలవనివ్వడనే భయం చంద్రబాబుతో పాటు స్థానిక టీడీపీ నేతల్లో ఉందని అంటున్నారు. దీంతో.. గత కొన్ని రోజులుగా లగడపాటి రాజగోపాల్ పేరు వినిపిస్తుంది.
వీరిలో ఎవరు పోటీ చేసినా…ఈసారి విజయవాడ ఎంపీ సీటు వైసీపీ వర్సెస్ టీడీపీ తో పాటు కమ్మ వర్సెస్ ఎస్సీ-బీసీ గా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. జగన్ కూడా క్లాస్ వార్ అనే చర్చ తెరపైకి తేవడంతోపాటు… వివక్షకు చోటు లేకుండా జరుగుతున్న పరిపాలనపై కొంతమంది పెత్తందార్లు చేస్తోన్న రాద్ధాంతం కూడా తోడవ్వడంతో… ఈసారి విజయవాడ ఎంపీ స్థానం ఎవరి కైవసం అవుతోందనేది ఆసక్తిగా మారింది.