ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు. కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఏమంటారు విసుక్కుని పట్టించుకోవడమే మానేస్తారు. పవన్ విషయంలో వైసీపీ వైఖరి చూస్తే ఇలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు పక్కా ప్లాన్ ప్రకారం పవన్ చంద్రబాబు మనిషని ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు వైసీపీ నేతలు. పవన్ విషయమై వైసీపీలో ఉన్న ఏ లీడర్ నోరు తెరిచినా చంద్రబాబుకు బీటీమ్ అనడమే తప్ప ఇంకొక మాట ఉండదు. అవినీతి మరకలు లేని మనిషి మీద ఇలాంటి గాలి విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి వారి బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికలు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా అదే పాత పాటను పాడుతుంటే ఏమనాలి.. క్లారిటీ లేదనే అనుకోవాలి.
పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడినా టీడీపీకి బీ టీమ్, చంద్రబాబు వద్ద ప్యాకేజ్ పుచ్చుకున్నాడు అనడమే వైకాపా నేతలకు పరిపాటి అయిపోయింది. పవన్ పాలసీల గురించి మాట్లాడితే ప్రెస్ మీట్లో ఒక నవ్వు నవ్వేసి చంద్రబాబు టాపిక్ తీసుకొచ్చేస్తారు వైసీపీ లీడర్లు. తాజాగా పవన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అయిన స్థానిక ఎన్నికలను నిర్వహించాలని, కరోనా విజృంభిస్తున్న సమయంలో శ్రీకాళహస్తీలో వైసీపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారు కదా అని ప్రశ్నించారు. నిజానికి ఎన్నికలు పెట్టడంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇక్కడ నడుస్తున్నదల్లా నిమ్మగడ్డ పంతం వెర్సెస్ వైఎస్ జగన్ పంతం.
ఈ వివాదంలో పంతాలే తప్ప ప్రజల శ్రేయస్సు ముఖ్యమైన మ్యాటరే కాదు. జనాన్ని చూపెట్టి తమ వాదనను బలపరుచుకుంటున్నారు అంతే. స్థానిక ఎన్నికలకు జనం వచ్చి ఓట్లు వేస్తే కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతుందనేది వైసీపీ నేతల వాదన. అసలు రాష్ట్రంలో ఎక్కడైనా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయా.. లేదు కదా. ప్రజలు ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. సమావేశాలు, రోడ్ షోలకు కొదవే లేదు. సినిమా హాళ్లు కూడ తెరుచుకున్నాయి. అన్నీ పాత పద్దతికే వచ్చేశాయి. జనం సొంత జాగ్రత్తలు తీసుకుని దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అన్నీ నార్మల్ అయిపోయాయి. కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది.
ఇంతకుముందులా కరోనా భయం మూలంగా ఏదీ ఎక్కడా ఆగట్లేదు. కానీ ఎన్నికలు మాత్రం పెట్టొద్దంటున్నారు పాలకవర్గం. ఏ విషయం మీదా పవన్ చటుక్కున మాట్లాడరు. ఎన్నికల విషయంలో కూడ హైకోర్టు తీర్పు సుస్పష్టమయ్యాకే ఎన్నికలు పెట్టండి అని అన్నారు తప్ప ఇంతకుముందు ఎక్కడా కూడ నిమ్మగడ్డను సపోర్ట్ చేయడం, ప్రభుత్వాన్ని తప్పు బట్టడం చేయలేదు. టీడీపీ, వైసీపీ కలబడుతున్న గొడవలో తలదూర్చలేదు. న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూశారు. కానీ వైసీపీ వర్గాలు, అనుకూల మీడియా మాత్రం పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాడని పాత పాటనే అందుకున్నాయి. వారి రియాక్షన్ చూస్తున్న జనం కూడ ఇంకెన్నాళ్లు ఈ డొంకతిరుగుడు విమర్శలు, సూటిగా సమాధానం ఇవ్వలేరా అంటున్నారు.