అధికారం చేతులు మారినట్టే పార్టీల నిర్ణయాలు కూడ మారిపోతుంటాయి. అధికారంలో ఉండగా ఒకలా లేనప్పుడు ఇంకోలా వ్యవహరించడం నాయకులకు పరిపాటి అయిపోయింది. పదవుల్లో కూర్చొని తాము చేరిన పనిని ఆ పదవులు పోయాక వేరొకరు చేస్తే తప్పంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేనికైతే వ్యతిరేకంగా మాట్లాడారో అధికారంలోకి వచ్చాక దాన్నే సమర్థిస్తారు. ఆంతా వారి ఇష్టం. వారికి అనుగుణంగానే అంతా జరగాలి. మధ్యలో చూస్తున్న జనమే వెర్రివాళ్లు అవుతుంటారు. ప్రజలు చూడరని, పట్టించుకోరని, గుర్తుపెట్టుకోరని అనుకుంటారో ఏమో కానీ ఏమాత్రం జంకు లేకుండా యూటర్న్ రాజకీయాలు చేసేస్తుంటారు లీడర్లు. వైసీపీ, టీడీపీ అనే తేడా లేదు. ఎవరి యూటర్న్ వారిది. అనుకూలంగా ఉంటే క్యారియాన్ అంటూ ప్రోత్సహిస్తారు. లేనప్పుడు గెటౌట్ అంటూ అడ్డుపడతారు.
దివీస్ ఫార్మా వ్యవహారం అలాంటిదే. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో యూనిట్ ప్రారంభించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది దివిస్ ఫార్మా. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ యూనిట్ ప్రారంభానికి అన్ని అనుమతులు వచ్చాయి. దివీస్ ఫార్మా యూనిట్ పెట్టుకోవడానికి అనుమతి అడగగానే చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా అనుమతులు ఇచ్చేసింది. కె-సెజ్ కు కేటాయించినా భూమిలో 500 ఎకరాలను వెనక్కి రప్పించి మరీ దివీస్ ఫార్మాకు కట్టబెట్టారు. మరొక చోట ఇంకో 279 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 500 ఎకరాల భూమిని ఎకరాన్ని 6 లక్షల చొప్పున అప్పనంగా ఫార్మాకు కట్టబెట్టారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 144 సెక్షన్, అరెస్టులు జరిగాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ దివీస్ ఫార్మా ఉండకూడదని ప్రభుత్వం మీద పెద్ద యుద్ధం చేసింది.
కానీ ఇప్పుడు అదే జగన్ ప్రభుత్వం దివీస్ ఫార్మా యూనిట్ ఏర్పాటుకు అనుమతులిచ్చేశారు. శంఖుస్థాపనకు స్వయంగా జగన్ ముఖ్యఅతిధిగా వెళ్ళనున్నారు. అప్పుడు కాలుష్యం అన్నవారే ఇప్పుడు పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం కంటే తక్కువ స్థాయికి తెచ్చి పైప్‌లైన్ ద్వారా సముద్రంలో 1.5 కి.మీ దూరంలో కలుపుతారని, మత్స్య సంపదకు, భూగర్భ నీటికి ఎలాంటిది హానీ ఉండదని వివరణ ఇస్తున్నారు. మరి అప్పుడు తప్పు అనిపించింది ఇప్పుడు ఒప్పు అని ఎలా అనిపిస్తోందో వారికే తెలియాలి.
ఇదే పెద్ద యూటర్న్ అనుకుంటే దీన్ని మించిన యూటర్న్ తీసుకుంది తెలుగుదేశం. అధికారంలో ఉండగా అనుమతులు, కారుచౌకగా భూములు కేటాయించిన అదే తెలుగుదేశం నాయకులు ఇప్పుడు దివీస్ ఫార్మాను వ్యతిరేకిస్తున్నారు. అది పర్యావరణానికి ముప్పని వాదిస్తున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారు చెప్పట్లేదు. పైపెచ్చు జగన్ యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయంలో ఒకరిది తప్పని, ఒకరిది ఒప్పని చెప్పడానికి లేదు. ఎవరికి వారు తమ వీలునుబట్టి యూటర్న్ తీసుకున్నారని అనుకోవడమే. ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి యూటర్న్ రాజకీయాలను గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలే.