వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టిన పర్యటన భారీ వర్షంలోనూ కొనసాగుతోంది. ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్, అనంతరం నగరంలో పర్యటిస్తున్నారు. జగన్ రాకతో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఎయిర్ పోర్టు నుంచి అడుగడుగునా ఘనస్వాగతం పలికాయి.
వైసీపీ అధినేతను చూసేందుకు వైసీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఎగబడటంతో విశాఖ రోడ్లు జన సంద్రంగా మారాయి. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. జగన్ వెంట వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
జగన్ ఇవాళ సాయంత్రం కల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి పరిశీలించనున్నారు. అలాగే, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించనున్నారు.
జగన్ టూర్ సందర్భంగా పోలీసులు ముందుగానే భారీ ఆంక్షలు విధించినప్పటికీ, జనం భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కొంతమంది వైసీపీ నేతల్ని పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు ఇతర నేతల్ని జగన్ టూర్ లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగినా, అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు.
మెడికల్ కాలేజీల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు జగన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆయన స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నారు. అయితే, జగన్ టూర్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. ఈ నిరసనలకు టీడీపీ ప్రోత్సాహం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

