వైసీపీ ప్లీనరీ ముగిసింది.! ఏం సంకేతం జనాల్లోకి వెళ్ళింది.!

అంగరంగ వైభవంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముగింపు ప్రసంగం చేశారు. జోరు వానలోనూ వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

కొత్తగా మాట్లాడటానికేముంటుంది.? చంద్రబాబు చేతి వేలికున్న స్మార్ట్ రింగ్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన పంచ్ డైలాగులు తప్ప, మిగతాదంతా పరమ రొటీన్ వ్యవహారమే. టీడీపీ మహానాడులో వైసీపీ మీద, వైఎస్ జగన్ మీదా ఎలాగైతే టీడీపీ నేతలు చెలరేగిపోయారు, వైసీపీ ప్లీనరీలో టీడీపీ మీదా, టీడీపీ అధినేత చంద్రబాబు మీదా అంతకు మించి చెలరేగిపోయారు వైసీపీ నేతలు.

అప్పుడు బ్లూ మీడియాపై విమర్శలు.. ఇప్పుడు యెల్లో మీడియాపై విమర్శలు.. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పార్టీ ప్లీనరీ ద్వారా వైసీపీ, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశమిచ్చింది.? అంటే, కొత్తగా ఏమీలేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. నిజానికి, అలా ఆశించడం కూడా జనమెప్పుడో మర్చిపోయారు.

బోల్డంత ఖర్చు చేశారు.. జనాన్ని తరలించడానికి చాలా కష్టపడ్డారు.. మొత్తం అధికార యంత్రాంగమంతా ప్లీనరీపైనే ఫోకస్ పెట్టిందా.? అనేంతలా అధికార వైసీపీ.. తన ‘పవర్’ని ఉపయోగించిందన్న విమర్శలు మామూలే.

కాగా, వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎంపికయ్యారు. ఇదొక్కటీ కొత్త వ్యవహారం. వైసీపీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేయడం మరో కీలక అంశం.