వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పులివెందుల నియోజవర్గంలోని వేంపల్లి మండలం ఇడుపులపాయలో వైసీసీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వీరన్నగట్టుపల్లెకు చెందిన పుల్లయ్యవర్గానికి చెందిన నలుగురిని ఇడుపులపాయకు చెందిన చలపతి వర్గం వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీలో వర్గ విభేదాలు వీధికెక్కాయి.
ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇక, ఇందుకు సంబంధించి ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే తమపై దాడి జరిగిందని పుల్లయ్య వర్గం వారు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఇటీవల వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాథ్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గురునాథ్‌రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.