ఏపీలో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా “పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో” అనే మూడే ప్రధాన అంశాలుగా మారాయి. అయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వీటిని దాటి కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. గత ఎన్నికల్లో జగన్ ఇదే మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రచారం చేసినా, ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కొన్నారు. అంతే కాకుండా, ప్రతిపక్షాలు అదే ఆయుధంగా మార్చుకుని ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
జగన్ ప్రభుత్వ హయాంలో పథకాలకు భారీగా ఖర్చు చేసినా, అవి అందరికీ చేరలేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. పైగా నారా లోకేశ్ యువగళం యాత్రలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ సంక్షేమం అందని వర్గాలపై స్పష్టమైన వివరాలు ప్రజలకు అందించారు. ఇక బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఇవన్నీ అమలయ్యాయని విస్తృతంగా ప్రచారం చేసింది. మధ్యతరగతి ఓటర్లు తమ పన్నులతో సంక్షేమం ఎందుకు అని ప్రశ్నించడం, వైసీపీపై వ్యతిరేకత పెరగడం, కూటమి దీనిని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల రాజకీయ సమీకరణం పూర్తిగా మారిపోయింది.
ఈ పరిస్థితిలో జగన్ మళ్లీ అదే పాత వ్యూహాన్ని పట్టుకుంటే అది విఫలమైన రాజకీయంగా మిగిలిపోతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే కూటమి పార్టీలు అభివృద్ధిని ప్రధాన అజెండాగా మలుచుకుని ముందుకు వెళ్తున్నాయి. టీడీపీ ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తూ, బడ్జెట్‌లో కూడా భారీ నిధులు కేటాయించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని నమ్ముకుని సొంత బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ మాత్రం హిందూత్వ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంచుకునే వ్యూహంతో ఉంది.
ఈ పరిస్థితుల్లో వైసీపీ తన విధానాన్ని మార్చుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పథకాలతోనే నెట్టుకొచ్చే రోజులు పోయాయి. అభివృద్ధి, సామాజిక సమీకరణ, స్పష్టమైన అజెండాతో ముందుకు వెళ్లే ప్రయత్నం లేకుండా వైసీపీ పునరాగమనం సాధ్యమవుతుందా? అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.