YSRCP Leader: వైసీపీకి మళ్లీ షాక్‌.. కీలక నేత రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న జకియా ఖానం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం, గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఆ తరువాత డిప్యూటీ చైర్‌పర్సన్ పదవిని చేపట్టి, కీలకంగా వ్యవహరించారు.

అయితే గత కొన్ని నెలలుగా ఆమె పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు అంతర్గత సమాచారం. రాజీనామా లేఖను ఆమె వ్యక్తిగత సహాయకుడి ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. వైసీపీతో విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, గత ఎన్నికల తరుణంలో తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, స్థానిక రాజకీయాల్లో పట్టించుకోకపోవడం వంటి అంశాలపై ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

దీంతో ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి బయటకు వచ్చిన నేపథ్యంలో, జకియా ఖానం రాజీనామా మరొక కీలక పరిణామంగా మారింది. ఇప్పటివరకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వంటి నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, ఇప్పుడు జకియా ఖానం పేరు ఆ జాబితాలో చేరింది. పార్టీ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి, లోపలి గందరగోళం వల్ల ఈ రాకపోకలు చోటు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.