రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో మినహా మిగతా అన్ని చోట్ల టీడీపీ ఓటమిపాలైంది. గెలిచిందల్లా కుప్పం నుండి చంద్రబాబు నాయుడు, ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడ ఓడించాలని వైసిపీ వ్యూహాలు పన్నుతోంది. ఆ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పని మీదే ఉన్నారు. పైకి కనబడే వాస్తవాలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. గ్రామ స్థాయిలో చంద్రబాబు నాయుడు పేరు ఇంకా జనంలో బలంగానే వినబడుతోంది. చంద్రబాబును రాయలసీమ వాసులు పూర్తిగా మర్చిపోలేదు. అందుకు సాక్ష్యాలు తాజాగా చోటుచేసుకున్న రెండు సంఘటనలు.
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇల్లా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పంపకాలతో జనంలో జగన్ ఇరు చిరస్థాయిగా నిలిచిపోవాలని పనిచేస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటే అనంతపురంలో కూడ పట్టాల పంపిణీ మొదలుపెట్టారు. మొదటిరోజు కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే హడావుడి చేయడానికి రెడీ అయ్యారు. మందీ మార్భలంతో పక్కాగా కార్యక్రమాలను సెట్ చేసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లబ్దిదారులకు పట్టాలు అందజేయడం స్టార్ట్ చేశారు. పట్టాలు ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల నోటి నుండి ముఖ్యమంత్రి జగన్ పేరు వినబడేలా చేయాలనే ఉద్దేశ్యంతో పట్టా ఇస్తూ ఒక మహిళను ఈ పట్టాలు ఎవరిస్తున్నారు అని పెద్దారెడ్డి అడగ్గా సదరు మహిళ తడుముకోకుండా చంద్రన్న ఇస్తున్నాడని చెప్పడంతో పెద్దారెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న నేతలు షాకయ్యారు.
మహిళ నోటి వెంట చంద్రన్న అనే పేరు వినబడగానే పెద్దారెడ్డిగారి ముఖంలో తీవ్ర అసహనం దర్శనమిచ్చింది. అయినా దాన్ని అణచుకుంటూ ఇకనైనా మారండి తల్లీ అంటూ మందహాసం చేశారు. ఇదొక్క చోటే ఇలా జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు కానీ కదిరిలో కూడ సేమ్ సీన్ రిపీటైంది. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పట్టా చేతిలో పెడుతూ మహిళను పట్టా ఎవరిస్తున్నారు అంటూ అదే ప్రశ్న అడిగారు. ఆమె కూడ చంద్రన్న ఇస్తున్నాడని అనడంతో ఎమ్మెల్యే ఇదేం ఖర్మరా దేవుడా అనుకుంటూ పట్టా ఇస్తున్నది జగనన్న అంటూ ఆ మహిళకు వివరించారు. ఈ రెండు ఘటనలతో స్థానిక జనంలో చంద్రబాబు పేరు ఎంతలా స్థిరపడిపోయిందో స్పష్టమైంది.
నిజానికి ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు నాయకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. వైసీపీ నేతలైతే మరీను. గతంలో ఇలాంటి కార్యక్రమాలే జరిగినప్పుడు వేదిక మీదకు పిల్లలను ఎక్కించి వారి చేత చంద్రబాబును విమర్శించిన సందర్భాలున్నాయి. మరి అలాంటి ఖచ్చితమైన ప్రణాళికలు చేసుకునే వైసీపీ నేతలు చంద్రబాబు పేరు వినబడేసరికి ఈ ఫాలోయింగ్ ఏంట్రా బాబు అనుకునే ఉంటారు. ఇక చంద్రబాబైతే ఈ జనం తన పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలకు షాకివ్వడం చూసి తెగ సంబరపడిపోతుంటారు.