వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారా.? బ్లాక్ డేనా.?

రాజకీయాల్లో ప్రజా ప్రతినిథులు గోడ దూకెయ్యడం అత్యంత సర్వసాధారణమైన విషయం. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి దూకేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కావడం గమనార్హం.

ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి నేతల ఫిరాయింపులు షురూ అవుతున్నాయ్.! అంటే, ఆ మధ్య టీడీపీ నుంచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు దూకేశారనుకోండి.. అది వేరే సంగతి. ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ఓ జనసేన ఎమ్మెల్యే కూడా అదనం. అసలు వైసీపీ నుంచి ఇప్పుడెందుకు టీడీపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారు.?

మంత్రి జోగి రమేష్ అయితే, ‘చంద్రబాబు మా ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు.. కొనేశాడు..’ అంటూ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు జోగి రమేష్. ‘ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇది బ్లాక్ డే..’ అంటూ జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్షంలో వున్న ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అమ్ముడుపోవడం మామూలే. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి అమ్ముడుపోవడమే వింత.

ఏముంది ప్రతిపక్షంలో.? వైనాట్ 175 అంటోన్న వైసీపీని కాదని, వైసీపీ ఎమ్మెల్యేలు ‘జీరో’ టీడీపీలోకి వెళతారట.? అంటే, ఇక్కడ వైసీపీ నేతలు గట్టిగా గగ్గోలు పెట్టడం మానేసి, ఎందుకు తమ పార్టీకి ఈ దుర్గతి పడుతోందో ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని టీడీపీ అధినేతకు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో. ఆ అవకాశం వైసీపీనే టీడీపీకి ఇస్తోంది.!