అధికార పార్టీ వైసీపీలోని లుకలుకలు ఎంత దాచినా దాగట్లేదు. పైకి పార్టీ బ్రహ్మాండగానే కనిపిస్తున్నా లోపల మాత్రం రగిలిపోతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్యన ఆధిపత్య పోరు నడుస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులను గట్టిగా నిలదీస్తుండటం చర్చనీయంశమవుతోంది. అయితే ఈ నిలదీత సొంత ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత గొడవల కారణంగానో కాదు. నియోజకవర్గాల సమస్యల గురించి. వైసీపీ అధికారంలోకి వచ్చి దగ్గదగ్గర రెండేళ్లు గడిచిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగిన రీతిలో పనులు జరగట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన కూడ సాగట్లేదు. అసలు ఎమ్మెల్యేలకు పనే లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమం అంటూ అప్పులు చేసి తెస్తున్న నిదులన్నింటినీ వాటికే కేటాయించేస్తున్నారు. నియోజకవర్గాల్లో పనులకు రూపాయి కూడ రావట్లేదు.
అనేక చోట్ల రహదారి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో చివరి దశలో అనేక పనులకు శంఖుస్థాపనలు చేసేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, స్థానిక మౌళిక వసతులు అంటూ ఎక్కడికక్కడ రాళ్లు పాతేశారు. ప్రభుత్వం మారడంతో ఆ అవన్నీ ఆగిపోయాయి. గెలిచినా పార్టీ కాబట్టి ఆ బాధ్యత మొత్తం వైసీపీ మీదనే పడింది. కొత్తవి ఎలాగూ మొదలుపెట్టేరు కాబట్టి పాత వాటినైనా పూర్తిచేయమని ఒత్తిడి పెరుగుతోంది ఎమ్మెల్యేల మీద. ఎక్కడికెళ్లినా జనం పనుల గురించే అడుగుతున్నారు. మొదట్లో ఏదోలా సర్దిచెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మాత్రం ఇక మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే అధిష్టానం ప్రతి నియోజకవర్గానికి ఇంటిని నిదుకు ఇచ్చేస్తామని, పనులు చేసుకోమని చెప్పింది. అది ఆ నిధులు ఇప్పటి వరకు విడుదలకాలేదు. కొన్ని చోట్ల వచ్చినా పూర్తిస్థాయిలో రాలేదు. ఆ నిధులతో పనులు చేయడమంటే కుదరని పని.
అందుకే ఎమ్మెల్యేలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. సరే గొప్పగా నడుస్తున్నా సంక్షేమ పథకాల్లో అయినా వారి హస్తం ఉంటుందా అంటే అదీ లేదు. అంతా వాలంటీర్లే చూసుకుంటున్నారు. ప్రతి పథకాన్ని వాళ్ళే నేరుగా జనం వద్దకు చేరుస్తున్నారు. ప్రజలు కూడ ఇంతకుముందులా అవసరం వస్తే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లడంలేదు. ఏమున్నా వాలంటీర్లతోనే చేయించుకుంటున్నారు. దీంతో ప్రజల్లో ప్రజాప్రతినిధుల పలుకుబడి నానాటికీ తగ్గిపోతోంది. దాన్ని కవర్ చేసుకోవాలంటే పనులు చేయడం ఒక్కటే మార్గం. మరోవైపు ప్రతిపక్షం అభివృద్ధిజరగట్లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు ఇక ఊరుకుంటే లాభంలేదని డిసైడ్ అయిపోయారు. ముఖ్యమంత్రిని కలవలేరు కాబట్టి మంత్రుల మీద పడిపోతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మంత్రులను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని, జనంలో తిరగలేకపోతున్నామని చెపుకుంటున్నారట. నియోజకవర్గాలకు ఇస్తామన్న నిధులను వెంటనే ఇవ్వాలని, వాటితో అరకొరగా అయినా పనులు చేసుకుంటామని పట్టుబడుతున్నారట. మొదట్లో మంత్రులు ఎమ్మెల్యేలను అదిరించో, బెదిరించో ఊరకుండబెట్టారు. అసెంబ్లీలో సైతం నిధుల గురించి అడగొద్దని నోళ్లు కట్టేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పూర్తి అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలకు సర్దిచెప్పడం వాళ్ళ తరం కావట్లేదట. అలాగని నేరుగా జగన్ వద్దకు వెళ్లి నిధులు వదలమని అడగలేరు. అందుకే జగన్ చుట్టూ ఉండే అతి కొద్దిమంది ముఖ్య నేతలకు ఈ సమాచారం చేరవేస్తూ త్వరగా ఏదో ఒక పరిష్కారం చూపించమని అడుగుతున్నారట.