చంద్రబాబుకి ఆ తృప్తి కూడా లేకుండా చేస్తున్న తిరుపతి తమ్ముళ్లు!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సమయంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి, ప్రభుత్వ వ్యతిరేకఓటు శాతాన్ని తగ్గించుకోవడానికి జగన్ కు సరిపడా సమయం ఉంది. అదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష వంటివి ప్రయత్నించడానికి కూడా విపక్షాలకు సమయం ఉంది. ఈ సమయంలో చేరికలకు బాబు తలుపులు తెరిసినా.. వచ్చేవారు వస్తున్నా.. ఆ సంతోషం లేకుండా అయిపోతున్న పరిస్థితి తాజాగా తెరపైకి వచ్చింది.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబుకు ఒక గుడ్ న్యూస్ వినిపించింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో నాయుడుని అమరావతిలో ఘనంగా ఆహ్వానించాలని బాబు ఫిక్సయ్యారు. ఆమేరకు ఏర్పాట్లు చేస్తూ, నాయుడికి అమరావతి వచ్చెయ్యి అంటూ సమాచారం కూడా ఇచ్చారు!

అయితే ఈ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నాయుడు చేరికను శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా… ఆయన చేరిక గురించి పార్టీ ముఖ్యులు ఎవరూ కూడా తనతో మాట్లాడలేదని, ఎస్సివి నాయుడుతో కలిసి స్థానిక టిడిపి లీడ‌ర్లు ఎవ‌రూ అమరావతికి వెళ్ళరాదని ఒక వాయిస్ మెసేజ్ ని వాట్సప్ లో షేర్ చేశారు. దీంతో టీడీపీలో అలజడి నెలకొంది.

దీంతో… సుధీర్ రెడ్డి మాటకు విలువిచ్చారో.. లేక, ఎస్సీవీ నాయుడి రాకను వ్యతిరేకిస్తున్నారో తెలియదు కానీ… ఈ కార్యక్రమానికి వెళ్లడానికి శ్రీకాళహస్తిలోని మెజారిటీ టీడీపీ కార్యకర్తలు ఆసక్తిని కనబరచలేదు. దీంతో చేసేదేమీలేక రాత్రికే రాత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని మార్చుకొన్నారు. ఫలితంగా… ఎస్సీవీ నాయుడి చేరిక‌ను తాత్కాలికంగా నిలిపేశారు.

అయితే మరీ ఇలా వదిలేస్తే బాగోదు అని భావించారో ఏమో కానీ… ఈ నెల 14న కుప్పానికి రావాల్సిందిగా బొజ్జ‌ల సుధీర్‌, ఎస్సీవీ నాయుడిని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో… ఇద్దరి మ‌ధ్య స‌యోధ్య త‌ర్వాతే ఎస్సీవీ నాయుడిని టీడీపీలో చేర్చుకోనున్నారని అంటున్నారు శ్రీకాళహస్తి తమ్ముళ్లు.

ప్రస్తుతం ఏపీ టీడీపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. బాబు పరిస్థితి ఎలా దిగజారిపోయింది.. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టిన వాయిస్ మెసేజ్ వల్ల బాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. పార్టీపై పట్టుకోల్పోతున్నారనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏముంది.. అంటూ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు!

దీంతో… కీలక సమయంలో గుడ్ న్యూస్ గా ఉన్న ఈ చేరికల సంతోషాన్ని కూడా మిగలనివ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి!