మొన్న అఖండ విజయం సాధించిన వైసిపి పేరుతో అరుదైన రికార్డు నమోదైంది. ఇంతకీ అదేమిటో తెలుసా ? తొమ్మిది మంది అన్నదమ్ములు వేర్వేరు నియోజకవర్గాల్లో గెలిచారు. అదికూడా ఒకసారి, ఒకే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పోటీ చేసిన అన్నదమ్ములు గెలిచి రికార్డు సృష్టించారు.
చిత్తూరు జిల్లాను తీసుకుంటే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ఎంఎల్ఏలుగా గెలిచారు. అలాగే రాజంపేట ఎంపిగా రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గెలిచారు.
కర్నూలు జిల్లాలో ముగ్గురు అన్నదమ్ములు గెలిచారు. జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో సాయిప్రసాదరెడ్డి, మంత్రాలయం నుండి బాలనాగిరెడ్డి గెలిచారు. అలాగే అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం నుండి వీళ్ళ తమ్ముడు వెంకటరామిరెడ్డి కూడా గెలిచారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సా సత్యనారాయణ గెలిస్తే గజపతినగరం నియోజకవర్గం నుండి బొత్స అప్పలనర్సయ్య గెలిచారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నియోజకవర్గం నుండి ధర్మాన కృష్ణదాస్ గెలిచారు. వీళ్ళిద్దరూ 2009 ఎన్నికల్లో కూడా గెలిచారు. మొత్తానికి వైసిపి తరపున గెలిచిన అన్నదమ్ములు, తండ్రి, కొడుకులు సందడి చేయనున్నారు.