జగన్ కు ఈ రేంజ్ దెబ్బ తగిలినా కూడా ఇంకా తత్వం బోదపడినట్లు లేదనే కామెంట్లు వినిపిస్తుండటం కామన్ అయిపోయిందని అంటున్నారు. ఈ స్థాయి ఓటమికి గల కారణాలు బహిరంగంగా చెప్పకపోయినా.. స్వీయ విశ్లేషణ చేసుకుని, తెర వెనుక నుంచి ఇప్పటికే కరెక్షన్స్ మొదలుపెట్టే ఉంటారని చాలా మంది భావించారు. అయితే పరిస్థితి అలా లేదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు… గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల తడకలు ఇవి అంటూ విరుచుకుపడుతున్నారు. 11 కి పరిమితమైన పార్టీని మరింత పాతాళానికి తొక్కే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే… ఆ విమర్శలను బలంగా (బూతులతో కాదు సుమా… ప్రజలకు అర్ధమయ్యేలా) తిప్పికొట్టే నేతలు వైసీపీలో కనిపించకపోవడం గమనార్హం!
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా రిషికొండ నిర్మాణాలపై బలంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో టూరిజం మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు.. ఖండించారు! ఇదే సమయంలో జగన్ ఆఫీసులో ఫర్నిచర్ అంశంపై విమర్శలు వచ్చాయి. కొడాలి నాని స్పందించారు.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు!
పోలవరంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై నాటి ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు కిందామీదా పడి ఏదోలా వివరణ ఇచ్చారనే కామెంట్లు వినిపించాయి. కట్ చేస్తే… అంశం ఏదైనా కాకాణి గోవర్ధన్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి విరుచుకుపడుతున్నారు. ఇది కూడా వైసీపీకి కలిసొచ్చే అంశం కాదని చెప్పలేం కానీ… అంతకంటే ముందు ఆయా శాఖల మంత్రులు స్పందించాలి!
గతంలో ఐ&పీఆర్ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని… వైసీపీ పై ఎలాంటి విమర్శలు వచ్చినా హుందాగా, అందరికీ ఆర్ధమయ్యే రీతిలో, ఉన్నంతలో స్పష్టంగా క్లారిటీ ఇస్తారు.. అవసరమైనప్పుడు గట్టిగా రియాక్ట్ అవుతారు.. రిటార్ట్ ఇస్తారు! ఈ నేపథ్యంలో… వైసీపీ ఓటమి అనంతరం కాస్త బ్యాక్ బెంచ్ కి పరిమితమైనట్లు కనిపించిన సజ్జల మాత్రం మళ్లీ యాక్టివ్ అయిపోయినట్లు కనిపిస్తుంది.
ఇందులో భాగంగా… కూటమి ప్రభుత్వం నుంచి, టీడీపీ నేతల నుంచి వస్తోన్న విమర్శలకు మాజీమంత్రులను పక్కన పెట్టుకుని (గతంలో ఉత్సవ విగ్రహాలు అనే కామెంట్లు వినిపించేవి!) ఈయన మైకందుకుంటున్నారు. తనకున్న జ్ఞానం మేరకు సమాధానాలు, వివరణలు ఇస్తున్నారు! అవి ఏమేరకు ప్రజలకు రీచ్ అవుతున్నాయనే సంగతి పక్కనపెడితే… ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఒకటుంది.
ఉదాహరణకు ఏదైనా టీవీ ఛానల్ లో కానీ, యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కానీ కాస్తా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత, క్లాస్ ఇమేజ్ ఉన్న నేత మాట్లాడితే రీచబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సకల శాఖా మంత్రి అనే పేరు సంపాదించుకుని, నేడు పార్టీ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడంలో వన్ ఆఫ్ ది కీలక పాత్ర అని వైసీపీ నేతలే చెబుతున్న సజ్జలతో వివరణ ఇప్పిస్తే… వైసీపీ కార్యకర్తలే ఆ వీడియోలు చూడటం లేదనే చర్చ గ్రామ స్థాయిలో బలంగా నడుస్తుంది.
పైగా… గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం స్పందించాల్సిన విషయాలపై కూడా తనదైన జ్ఞానంతో సజ్జల స్పందించేవారు.. పక్కన కేబినెట్ మంత్రులు కూర్చుని ఉండేవారు! దీంతో… అప్పట్లో విపక్షాలకు ఫుల్ గా అవకాశం దక్కేది.. సాక్షి ఆఫీసులో పనిచేసే జీతగాడ్ని తీసుకొచ్చి ప్రభుత్వ నుంచి జీతం ఇచ్చి ఇలా సకలశాఖా మంత్రిని చేసి, ప్రజలచే ఎన్నుకోబడిన మంత్రులను, ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలు చేశారనే కామెంట్లకు ఫుల్ గా స్పేస్ దక్కేది!
అందువల్ల… ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు ఎలా భావిస్తున్నారు, సజ్జల రియాక్షన్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఫలానా శాఖపై విమర్శలు వచ్చినప్పుడు ఆ శాఖకు పనిచేసిన మాజీలే వివరణ ఇస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కదా.. అది సహేతుకం కూడా కదా.. అప్పుడు గతంలో మీరు తప్పుచేయలేదు గనుకే ఇలా మైకుల ముందుకు వచ్చి వివరణ ఇస్తునారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి కదా అనే విషయాలు జగన్ ఇప్పటికైనా గ్రహించాలి.
అలాకాని పక్షంలో… జరిగిదేమిటనేది మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియకపోవచ్చు జగన్ అని అంటున్నారూ పరిశీలకులు!