ఎన్టీఆర్ కంటే రజనీకాంత్ ఏ విషయంలో గొప్పోడు?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. మరి ముఖ్యంగా ఏపీలోనూ బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఇది! నటుడిగా ఎన్టీఆర్ కంటే రజనీకాంత్ గొప్పోడా… ప్రజాసేవ విషయంలో ఎన్టీఆర్ ని మించినవాడా రజనీకాంత్… ఏ విషయంలో ఎన్టీఆర్ తో రజనీకాంత్ కి పోలిక? మరే విషయంలో ఎన్టీఆర్ కంటే రజనీకాంత్ మెరుగు? ఏపీలో ఎవరైనా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

అవును… ఒక నటుడిగా తీసుకుంటే… ఈ జనరేషన్ జనాలకు రజనీకాంత్ ఒక తమిళ సూపర్ స్టార్ గా తెలిసి ఉండొచ్చు. ఆయనకంటే ఆయన అల్లుడు ధనుష్ కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండి ఉండొచ్చు. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే… తలపతి విజయ్ రజనీని కాదని దూసుకుపోతున్న పరిస్థితి. ఇదే క్రమంలో అజిత్ కూడా. మరి అలాంటి రజనీ… విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావుతో నటన విషయంలో… నటుడిగా సమానం కాదు, సమ ఉజ్జీ కాదు.. పోటీ కానే కాదు! అంటే… నటన విషయంలో ఎన్టీఆర్ ముందు రజనీకాంత్… జుజుబి అన్నమాట!

ఇక రాజకీయాల విషయానికొస్తే… పార్టీపెట్టిన తొమ్మిదినెలల్లోనే రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చి, ముఖ్యమంత్రి అయిన శక్తి… రామారావు. మరి ఏ పార్టీలోకి వెళ్లేది, సొంతంగా పార్టీ పెట్టేదా, ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి రజనీకాంత్ ది. పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేసిన అసలు సిసలు పోరాట యోధుడు ఎన్టీఆర్. కాసేపు బీజేపీ చంకనెక్కుతూ, మరి కాసేపు సొంత కుంపటి అని చెబుతూ అభిమానులను, ప్రజలను కన్ ఫ్యూజన్ లో పాడేసే అచేతనుడు రజనీకాంత్!

మరి ఏ విషయంలో ఎన్టీఆర్ కంటే రజనీకాంత్ గొప్పోడు? ఈ ప్రశ్న ఎందుకంటే.. పైన చెప్పుకున్న ఆ వివరణ ఎందుకంటే…. అంత గొప్ప ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినప్పుడు స్పందించని వారు… అంత గొప్ప వ్యక్తినుంచి పార్టీని దొంగిలించినప్పుడు నోరు మెదపని వారు.. అంత గొప్ప మహానువావుడిపై చెప్పులు వేసినప్పుడు మౌనంగా ఉన్నవారు.. విశ్వవిభాతుడిని అచేతనుడిగా ఇంటికి పరిమితం చేసినప్పుడు నిస్సిగ్గుగా స్పందించకుండా తప్పించుకు తిరిగినవారు.. నేడు రజనీకాంత్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే… మైకులముందుకు వచ్చేస్తున్నారు. నిస్సిగ్గుగా, దిగంబరంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ పెద్దాయనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.