వైసీపీలో అనేకమంది నాయకులు ఇప్పటికీ పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి పదవులు పంచినా ఇంకా కొందరు లీడర్లు మిగిలిపోయారు. వారిలో చాలామంది పెద్ద నామినేటెడ్ పదవి దక్కితే బాగుండని ఆశపడుతున్నారు. అలాంటి పెద్ద నామినేటెడ్ పదవుల్లో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కూడ ఒకటి. మొదట్లో ఈ పదవి కోసం చాలామంది నాయకులు పోటీలు పడ్డారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేశారు. కానీ చివరకు జగన్ ఆ పదవిని ద్రోణంరాజు శ్రీనివాసరావుకు అప్పగించారు. గతంలో ఉన్న విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీనే చంద్రబాబు నాయుడు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి మార్చారు.
అయితే ఒకప్పుడు ఉన్నంతగా ఈ పదవికి ఇప్పుడు క్రేజ్ లేకుండా పోయింది. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు లీడర్లు. గతంలో లాబీయింగ్ చేసిన నేతలెవరూ ఇప్పుడు చెయ్యట్లేదు. ద్రోణంరాజు ఆకస్మిక మరణంతో ఆయన వర్గంలోనే ఈ పదవి మీద విముఖత మొదలైంది. గతంలో ఉడా చైర్మన్ పదవిలో పనిచేసిన చాలామంది పెద్దగా రాజకీయాల్లో రాణించిన దాఖలాలు లేవు. ఆ సెంటిమెంట్ మేరకే ద్రోణంరాజు కూడ ఆ పదవి పుచ్చుకుని పెద్దగా వెలిగిపోయింది లేదని ఆ పదవి ఆయన తండ్రి సత్యనారాయణకు కలిసొచ్చినంతగా శ్రీనివాసరావుకు కలిసిరాలేదని ఆయన వర్గం చెప్పుకుంటున్నారట.
ఈ మాటలు విన్న వైసీపీ లీడర్లు గతంలో ఉడా చైర్మన్ పదవిని చేపట్టినవారి రాజకీయ జీవితాలను పరిశీలిస్తున్నారట. ఆ పరిశీలనలో ద్రోణంరాజు సత్యనారాయణ, డీవీ సుబ్బారావు, ఎంవీవీఎస్ మూర్తి తప్ప ఆ పదవి చేపట్టిన మిగిలిన వారంతా పెద్దగా రాజకీయాల్లో రాణించలేదనే అంచనాలకు వచ్చేశారు. అందుకే విశాఖ రాజధాని అవుతున్నా, మంచి పరపతి నడిపే అవకాశం ఉన్నా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని చేపట్టడానికి వైసీపీలోని పెద్ద తలలేవీ సుముఖత చూపట్లేదట. చివరికి జగనే ఎవరోఒకరి పేరును ఖాయం చేసేసి పదవి అందుకోవాల్సిందే అనే షరతు పెడితే తప్ప ఆ పదవి భర్తీ అయ్యేలా లేదు.