వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి చర్చలు జరిపారు. కానీ అప్పుడు లేని ఉత్సాహం తాజాగా జరిపిన పర్యటన తర్వాత కనిపిస్తోంది. పర్యటన వివరాలను ఎప్పటిలాగే అంతా బాగానే జరిగిందంటూ చూచాయిగా బయటపెట్టిన వైసీపీ నేతలు లోపల మాత్రం పండుగ చేసుకుంటున్నారట. ఈ టూర్ ద్వారా పరిస్థితులు మెరుగవుతాయని, పార్టీ మరింత బలపడుతుందని నమ్మకంగా ఉన్నారట వాళ్లంతా. గతంలో కంటే ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో, ధీమాతో మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు మూడు రాజధానుల విషయంలో చేసి తీరుతాం అని మాత్రమే అంటూ వచ్చిన నేతలు ఇప్పుడు మాత్రం జరిగిపోతుంది. దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి అయితే ఎవరితో చర్చలు జరపాలి వాళ్లతో జరిపాం, మూడు రాజధానులను ఎవరూ ఆపలేరని అన్నారు. దీన్నిబట్టి అమరావతి విషయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్ర పెద్దల నుండి ఆయన హామీ తెచ్చుకున్నట్టే అనిపిస్తోంది. అంతేకాదు పోలవరం విషయంలో కూడ అంచనా వ్యయానికి తగ్గట్టే నిధులు విడుదలచేసేలా ఒప్పందం చేసుకున్నారని, త్వరలోనే నిధులు వచ్చేస్తాయని అంటున్నారట. అదే నిజమై పోలవరాన్ని గనుక చెప్పిన గడువుకు పూర్తిచేస్తే మాత్రం జగన్ లెవల్ ఇంకా పెరిగిపోతుంది. త్వరలోనే ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అది ప్రజల్లో పార్టీ పరపతిని చాలా దూరం తీసుకెడుతుంది. ఆ మహత్తర కార్యక్రమం ఫలితం మామూలుగా ఉండదు. వీటన్నింటికీ మించి న్యాయవ్యవస్థతో జరుగుతున్నా పోరాటంలో కేంద్రం నుండి సానుకూల దృక్పథం కనబడిందని చెప్పుకుంటున్నారు.
ఢిల్లీ పర్యటన తర్వాతే హైకోర్టు జడ్జిల మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం పరిశీలన అంశంలో హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీమ్ కోర్టు బ్రేకులు వేసింది. ఇవన్నీ ప్రభుత్వానికి బాగా ఉపకరించే అంశాలు. కోర్టుల నుండి వస్తున్న సానుకూల తీర్పుల వలన ఇన్నాళ్లు కోర్టుల విషయంలో జగన్ సర్కార్ కావాలనే దూకుడుగా వెళుతోందనో, ఏదో ఒకనాడు కోర్టు ధిక్కరణ చర్యలకు గురికాక తప్పదనే విమర్శల నుండి బయటపడటానికి వీలు దొరికింది. ఇక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కోర్టు కేసుల విషయంలో జగన్ త్వరలోనే ఇబ్బందుల పాలవుతారనేది కూడ జరక్కపోవచ్చు. గతంలో కోర్టు కేసుల అంశంలో వైసీపీ నేతలు కొంత ఆందోళనగానే ఉండేవారు. ప్రతిపక్షాలు కూడ జగన్ లోపలి వెళితే తర్వాతి లీడర్ ఎవరనేది వెతికి పెట్టుకోండి లాంటి విమర్శలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు కూడ ఢిల్లీ నుండి సేఫ్ అనే సమాచారాం వెళ్లిపోయి ఉండొచ్చు. ఈ విషయాలన్నీ కలిసి పాలక వర్గంలో పండుగ వాతావరణం నెలకొనేలా చేశాయి.