వైసీపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న జాకియా ఖానమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. విజయవాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
మొదట టీడీపీ సభ్యులతో చర్చలు జరిగినా ఎందుకో అటు వైపు నుంచి ఆమెకు సరైన మద్దతు లభించలేదని టాక్. దీంతో బీజేపీ డోర్ ఓపెన్ చేయడంతో ఆమె అటు వైపు జంప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో వైసీపీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న జాకియా, కీలక సమయాన బీజేపీ వైపు మొగ్గుచూపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నాయకురాలు బీజేపీలో చేరడం ఓ వాదనకు తలుపులు తెరిచింది.
“ప్రధాని మోదీ అందరినీ సమానంగా చూస్తున్నారు. ముస్లిం మహిళలకు ఇచ్చిన భరోసా నన్ను ఆకట్టుకుంది” అని జాకియా ఖానమ్ అన్నారు. బీజేపీలో చేరడం ద్వారా ముస్లింలలో కొత్త ఆశలు రేకెత్తించాలన్నదే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ అన్ని వర్గాల అభివృద్ధికే కృషి చేస్తోందని, జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ పాలన ఆ దిశలోనే నడుస్తోందని చెప్పారు.
మైనార్టీలకు అండగా నిలిచే పార్టీగా బీజేపీ పేరుగాంచిందని పేర్కొన్నారు. జాకియా కుటుంబం అనుభవజ్ఞులేనని, ఆమె చేరికతో బీజేపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ముస్లిం మైనారిటీ మహిళా నేత, రాష్ట్ర శాసనమండలి కీలక పదవిని వదులుకుని బీజేపీలో చేరడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసింది. జాకియా ఖానమ్ ఒక్క అడుగుతో వైసీపీకి ఎదురు దెబ్బ ఇచ్చారు. మైనార్టీ వర్గాల సమీకరణల్లో ఇది కీలక మలుపు కావచ్చు. భవిష్యత్తులో ఆమె బీజేపీలో ఎంత కీలక పాత్ర పోషిస్తారో వేచి చూడాల్సిందే.