సీఎం జగన్‌కి ఏమన్నా ఉపయోగముందా.?

ఇటీవల సీమ గర్జన జరిగింది.. సీమలో హోరెత్తాల్సిన యువత, ఒకింత నీరసంగా కనిపించింది. కారణమేంటి.? జనాన్ని సమీకరించడానికి వైసీపీ నేతలు ఓ మోస్తరుగా కష్టపడ్డ మాట వాస్తవం. జనాన్ని సమీకరించగలిగారుగానీ, వారిలో ఉత్సాహం నింపలేకపోయారు.

రాయలసీమలో రాజధాని.. అనేది కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో వున్నది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అప్పటి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సమయంలో కర్నూలు నగరమే రాజధానిగా వుండేది. ఆ తర్వాత కర్నూలు నుంచి రాజధాని అనేది హైద్రాబాద్‌కి తరలిపోయింది.

చరిత్రను వక్రీకరించడానికి వీల్లేని పరిస్థితి. కానీ, వక్రీకరణకు గురవుతూనే వుంది. కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని అంటోంది వైసీపీ. కానీ, ఎక్కడ.? ఆ జోష్ వైసీపీలో ఎందుకు వుండటంలేదు.? రాయలసీమలో వైసీపీకి తిరుగు లేదు. అయినాగానీ, ఆ స్థాయిలో నాయకత్వం సమర్థవంతంగా పని చేయకపోవడంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడేమో జయహో బీసీ మహాసభ.. అంటోంది వైసీపీ. విజయవాడ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. బీసీ నేతల హంగామా ఎలా వుంటుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, విపక్షాల మీద విమర్శలకీ, అధినేత భజనలకే కార్యక్రమాలు పరిమితమవుతాయన్నది నిర్వివాదాంశం.

బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకుని మరింత పదిలంగా చేసుకోవాలన్న ఆలోచనతో చిత్తశుద్ధితో కూడిన ప్రసంగాలైతే బీసీ నేతల నుంచి కనిపించకపోవచ్చు. అధినేత అత్యద్భుతమైన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా, నేతలు మాత్రం, అధినేత వ్యూహాల్ని విజయవంతం చేయలేకపోతున్నారు.