వైఎస్సార్సీపీలో గర్జనల గందరగోళం.

‘మనం లక్షలాది మందిని ప్రజా సంకల్ప యాత్రలో ఎలా పోగెయ్యగలిగాం.? ఇప్పుడెందుకు ఆ పని చెయ్యలేకపోతున్నాం. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నాం.. ప్రజల కోసమే కదా మూడు రాజధానులని అంటున్నాం. ప్రజలెందుకు స్పందించడంలేదు.? లబ్దిదారుల్ని బలవంతంగా ఎందుకు తరలించాల్సి వస్తోంది.?’

ఇలా చాలా ప్రశ్నలు వైసీపీలో అంతర్మధనానికి దారి తీస్తున్నాయి. అప్పట్లో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కోసం స్థానిక నాయకులు పెద్దయెత్తున జనాన్ని తరలించేవారు. అధికార పీఠమెక్కగానే ఆయా నాయకుల్లో అలసత్వం ఎక్కువైపోయింది.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం కోసం పిలుపునిస్తే, కుటుంబ సభ్యుల్ని పంపుతున్నారు కొందరు నేతలు. అధినేత ఈ విషయమై గుస్సా అవుతున్నా వైసీపీ స్థానిక నేతల్లో మార్పు రావడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు.

రాయలసీమలో గర్జన అంటే, దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమనే స్థాయిలో వుండాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తే అది తప్పెలా అవుతుంది.? రాయలసీ అంటే, వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం. అలాంటిది, కర్నూలు వేదికగా జరిగిన గర్జన ఆశించిన మేర ఫలితానివ్వలేదు. మరీ పచ్చ మీడియా చూపించినంత పలచగా లేదక్కడ పరిస్థితి. కానీ, వైసీపీ ఆశించిన మేర ప్రజా స్పందన మాత్రం లేదు.

‘స్పందన ప్రజల్లోంచి రాకపోతే మనమేమీ చేయలేం.. మీరు సరిగ్గా వ్యవహరించకపోతే కష్టం..’ అంటూ అధినేత వైఎస్ జగన్, సీమ నేతలపై గుస్సా అయ్యారంటూ తాజాగా ఓ ఆసక్తికరమైన లీక్ వైసీపీ నుంచే బయటకు వస్తోంది.