వైసీపీ గోదారి రాజకీయం.! జనసేన యెత్తులకు పై యెత్తులు.!

రాజకీయాలన్నాక యెత్తులకు పైయెత్తులు వుండాల్సిందే. వుంటాయి కూడా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ‘వారాహి విజయ యాత్ర’ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వారాహి యాత్ర’ జరగాల్సి వుంది. మూడో విడత వారాహి విజయ యాత్రకు జనసేనాని సర్వసన్నద్ధమయ్యారు.

అసలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే జనసేనాని వారాహి విజయ యాత్రను ఎందుకు ప్రారంభించినట్లు.? అంటే, ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా వున్న ప్రాంతమిది. రాజకీయంగా ఇదో స్పెషల్ ప్రాంతం.. అని చెప్పొచ్చు.

టీడీపీ అధినేత చంద్రబాబుని పొత్తుల విషయమై ఇరకాటంలో పడేయాలన్నా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఓటు బ్యాంకు పెంచుకోవడం జనసేనానికి అవసరం. అలా, ఈ జిల్లాలపై జనసేనాని ఫోకస్ పెట్టారు. మరి, దీనికి విరుగుడు మంత్రాన్ని అధికార వైసీపీ తీసుకురావాలి కదా.?

ముద్రగడ పద్మనాభం సహా.. పలు అస్త్రాల్ని ఇప్పటికే జనసేనాని మీద వైసీపీ ప్రయోగించేసింది. కాపు రిజర్వేషన్ వ్యవహారంలో వైసీపీకి పట్ల కొంత నెగెటివిటీ వుంది. ఆ విషయమ్మీదనే, వైసీపీలో కసరత్తులు జరుగుతున్నాయట ఇప్పుడు. అదొక్కటే కాదు, కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏమేం చేయాలన్నదానిపై వైసీపీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి.

వైసీపీ కాపు నేతల్ని జనసేనాని టార్గెట్ చేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. కొందరు వైసీపీ కాపు నేతలు, కౌంటర్ ఎటాక్ జనసేన అధినేతకు గట్టిగానే ఇస్తున్నారు.. ఇంకొందరు తటపటాయిస్తున్నారు. వారితో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీలు నిర్వహించే ఆలోచనలో వున్నారట. వీలైనంత త్వరగా విరుగుడు మంత్రాన్ని పకడ్బందీగా జనసేన మీద వైసీపీ అధినాయకత్వం ప్రయోగించబోతోందిట.