ఈసారి టీడీపీ యువకిశోరం చినబాబుకు మంగళగిరిలో టఫ్ ఫైట్ ఫిక్స్ చేయాలని ఫిక్సయ్యారు వైఎస్ జగన్. వరుసగా రెండోసారి కూడా మంగళగిరిలో లోకేష్ ను ఓడించడం ద్వారా… టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే చర్చ లేవదీయాలని అధికారపార్టీ అధినేత భావిస్తున్నారు. ఇందులో భాగంగా… బీసీ క్యాండిడేట్ ని నిలబెట్టాలని ఫిక్సయ్యారు.
అవును… మంగళగిరిలో చేనేత సామాజికవర్గ జనాభా అధికంగా ఉంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల అతి తక్కువ తేడాతో ఓడిపోయి.. ఇపుడు వైసీపీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ టీడీపీల నుంచి వచ్చిన మురుగు హనుమంతరావు అనే మరో బలమైన చేనేత సామాజికవర్గం నేత కూడా వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరికి తోడుగా… తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ… చేనేత సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతకు వైసీపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కీలకమైన నాయకులురాలు చేనేత సామాజికవర్గం నేత కాండ్రు కమల కూడా వైసీపీలో ఉన్నారు. వీరంతా మంగళగిరిలో చక్రం తిప్పేవారే.
దీంతో… వీరందరినీ ఈ నియోజకవర్గంలో మొహరింప చేసి.. రాబోయే రోజుల్లో రాజకీయం చేయబోతున్న అధికారపార్టీ… అత్యధిక జనాభా ఉన్న చేనేతల నుంచే ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధిని కూడా నిలబెట్టబోతుందని అంటున్నారు. అంటే… కచ్చితంగా బీసీ కార్డుతోనే వైసీపీ ముందుకు రాబోతుందన్నమాట. దీంతో… లోకేష్ కి భారీగా చెక్ పెట్టినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.
దీనికి తోడు… మంగళగిరి నిజానికి టీడీపీకి బాగా వీక్ సీటు కూడా. అక్కడ ఆ పార్టీ చివరి సారిగా గెలిచింది 1985లో అంటే… ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా టీడీపీ మంగళగిరిలో గెలువలేదు. ఆఖరికి అధినేత కుమారుడి హోదాలో లోకేష్ పోటీచేసినా… గెలుపు అందని ద్రాక్షగానే ఉన్న పరిస్థితి. దీనికి తోడు జగన్ బీసీ స్కెచ్!
చంద్రబాబు తరువాత టీడీపీని లీడ్ చేసేది లోకేష్ అని అంటున్న పరిస్థితుల్లో… ఆయన్నే రెండు సార్లు ఓడించి.. ఏమీ కాకుండా చూపిస్తే, టీడీపీకి ఇక సరైన రాజకీయ నాయకత్వమే లేకుండా పోతుందనే విషయం జనాల్లోకి తీసుకెళ్లడంతోపాటు.. ఆ పార్టీ భవిష్యత్తు సైతం ఇబ్బందులలో పడిందనే సంకేతాలు టీడీపీ కేడర్ కు పంపాలన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్ అని తెలుస్తుంది.
మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తున్నాయా… లేక, ఈ వ్యూహాలు తెలిసి చినబాబు మంగళగిరిని వదిలి వేరే సేఫ్ జోన్ చూసుకుంటారా… అదీగాక, వీర మరణమో – వీర స్వర్గమో మంగళగిరిలోనే అని ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి!