హంస పాల నుండి నీటిని వేరు చేస్తుంది. ఇది సృష్టిలో దానికి మాత్రమే ఉన్న గొప్ప లక్షణం. అలాగే రాజకీయ పార్టీలకు అండగా ఉండే మీడియా సంస్థలకు కూడ హంసకు ఉన్నటువంటి ఆ వేరు చేసే లక్షణమే ఉంది. మీడియా అంటే అన్నింటినీ కవర్ చేయాలి. ఎవరు ఎలా స్పందించినా నిక్కచ్చిగా చెప్పాలి. హేతుబద్దమైన అభిప్రాయాలను వెల్లడి చేయాలి. రాజకీయ నాయకులంటే తమకు, తమ పార్టీలకు అనుకూలంగా మాట్లాడతారే తప్ప ప్రత్యర్థులు చేసింది మంచి పనే అయినా ఏదో ఒక సాకు పెడతారు. తాజాగా జగన్ సర్కార్ చేపట్టిన సమగ్ర భూసర్వే గురించి చంద్రబాబునాయుడు స్పందిస్తూ జగన్ ఆరు రకాల భూముల మీద కన్నేశారని, అందుకే ఈ సర్వే అని బురద చల్లే ప్రయత్నం చేశారు తప్ప 100 ఏళ్ల తర్వాత భూసర్వే జరుపుతున్నందుకు అభినందించలేదు. అలాంటప్పుడు వాస్తవాన్ని బయటపెట్టాలసింది మీడియానే. కానీ ఆ మీడియానే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి.
తాము కొమ్ముకాసే పార్టీల మీద పొగడ్తలు వచ్చినప్పుడు వాటిని వీర లెవల్లో ఎలివేట్ చేసే మీడియా సంస్థలు విమర్శలు వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతున్నాయి. మచ్చుకు కూడ వాళ్ళు మాట్లాడిన మాటలను ఉటకించట్లేదు. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ గురించి సమగ్రంగా మాట్లాడారు. ప్రాజెక్టు విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా విశ్లేషించారు. ప్రాజెక్టరును డీపీఆర్ ప్రకారమే కట్టి తీరాలన్న ఆయన పునరావాస ప్యాకేజీపై నిధులపై రాజీపడితే రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినవారవుతారని, ఒకసారి నీళ్లు వచ్చాక ఎత్తు పెంచారా లేదా అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరన్నారు. ఆ నీళ్లు అయిపోయాక అప్పుడు రోడ్లమీదకు జనం వస్తారని అప్పటికి జరగాల్సింది జరిగిపోతుందని, పోలవరంపై పోరాడాల్సిందేనని బల్లగుద్ది చెప్పారు.
ప్రాజెక్టులో 41 మీటర్ల ఎత్తువరకే నీటిని నిల్వ చేయాలనే ఆలోచను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన పోలవరం విషయంలో కేంద్రంతో జరిపిన సంప్రదింపులపై ముఖ్యమంత్రి జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. లోపల ఏం చర్చించారో చెప్పకుండా బయటికొచ్చి ప్రాజెక్టు పూర్తవుతుందని అంటే జనం ఎలా నమ్మాలని, అసలు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని, దాన్ని గట్టిగా ప్రశ్నించాలని, పోలవరం పూర్తయ్యేవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించాలని, వాళ్ళు నీళ్లు వాడకపోతే మనకు పూర్తిస్థాయిలో నీరు వస్తుందని, మనకు పోలవరం ఒక్కటే మార్గమని హితవు పలికారు. జగన్‌ది కుటుంబ పార్టీ. అది రెడ్ల పార్టీ. గతంలో రెడ్లంతా కాంగ్రె్‌సను ఆక్రమించి ఉండేవారు. టీడీపీ కమ్మ పార్టీ. రెండూ పాలక పార్టీలు. మిగతా కులాలు ఆలోచించాలి. వైసీపీపై విమర్శలు చేస్తే, తనను అడ్డుకోవడానికి రకరకాలుగా బెదిరిస్తున్నారని అన్నారు.
ఈ విమర్శలన్నీ చేశాక ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని, ఆ రోజు ఆయన పూనుకోకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యేది కాదని అన్నారు. ఆయన స్పీచ్ మొత్తంలో అధికార పార్టీ అనుకూల మీడియాకు ఈ ఒక్క మాట తప్ప మిగతావేవీ వినబడలేదు. ప్రభుత్వం మీద ఆయన చేసిన విమర్శలన్నింటినీ ఫిల్టర్ చేసేసి కేవలం వైఎస్ఆర్ గురించి చెప్పిన పొగడ్తలనే ప్రముఖంగా ప్రచురించారు. ఇలా విమర్శల్లో కూడ పొగడ్తలను వెతుక్కోవడమనే ఆశావాద ధోరణి అనుకూల మీడియాకే సాధ్యం.