2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అన్ని రాజకీయ పార్టీలకూ కీలకం కాబోతోంది. ఏం, రాష్ట్రంలో వేరే సామాజిక వర్గాలు లేవా.? రాజకీయాల్ని ప్రభావితం చేసేలా ఆయా సామాజిక వర్గాలకు ఓటు బ్యాంకు లేదా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే ‘కాపు సామాజిక వర్గం’ చుట్టూ ఇంత చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గం పూర్తిగా అండదండలు గనుక అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి అందించి వుంటే, మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి వుండేవారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గమంతా నడిచినా, ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారే. ఏ సామాజిక వర్గం తీసుకున్నా, మొత్తం సామాజిక వర్గం ఓ పార్టీ వెంట నడవడం అనేది జరగని పని.
కొడాలి నాని వైసీపీలో వున్నారు. మరికొందరు కమ్మ సామాజిక వర్గ నేతలూ వైసీపీలో వున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు టీడీపీలోనూ వున్నారు. రెడ్ల పార్టీ అని వైసీపీనీ, కమ్మ పార్టీ అని టీడీపీనీ అనడం.. అదో రాజకీయ తంత్రం.! ఇంకా చెప్పాలంటే, కుతంత్రం అనొచ్చు.
అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద కాపుల పార్టీ అనే ముద్ర వేయడం అనేది, ఇతర పార్టీల రాజకీయ యెత్తుగడ. తద్వారా ఇతర సామాజిక వర్గాల్ని ప్రజారాజ్యానికి దూరం చేసి, కాంగ్రెస్ లబ్ది పొందింది. టీడీపీ కూడా అంతే.
ఇక, ఈసారి మాత్రం లెక్కలు మారాయి. కాపు సామాజిక వర్గంలో ‘మనమెందుకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కకూడదు.?’ అన్న చర్చ జరుగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్‌ని ఎంతవరకు నమ్మగలం.? అన్న అనుమానాలు ఆ సామాజిక వర్గంలో వున్నాయి. దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది వైసీపీ.
పవన్ కళ్యాణ్ మీద అనుమానాలున్నమాట వాస్తవమేగానీ, కాపు సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో వైసీపీని నమ్మే అవకాశాలు కన్పించడంలేదు. ఇక్కడ మొత్తం సామాజిక వర్గం కాదు, అందులోని మెజార్టీ ఓటు బ్యాంకు అనొచ్చు. ముందు ముందు పవన్ తీసుకునే రాజకీయ నిర్ణయాలే కాపులు ఎటువైపు వుండాలన్నదాన్ని డిసైడ్ చేస్తాయి.