మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తోన్న వైఎస్సార్సీపీ.!

YSRCP :కోనసీమ అల్లర్ల కేసుకి సంబంధించి అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలవురి అరెస్టుని పోలీసులు అధికారికంగా ప్రకటించారు కూడా. కొత్త జిల్లాలో జరిగిన తొలి ఘటన, అత్యంత దారుణమైన ఘటన కావడంతో, కోనసీమ అల్లర్ల కేసుని పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, తీసుకుంటాయి కూడా.

ఈ మొత్తం అల్లర్లకు సంబంధించి అన్యం సాయి అనే వ్యక్తిని సూత్రధారిగా, ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తోన్న విషయం విదితమే. కోనసీమ జిల్లా పేరు మార్చ వద్దంటూ ఇటీవల అన్యం సాయి, కోనసీమ కలెక్టరేట్ వద్ద హంగామా చేశాడు. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నమూ చేశాడు. ఇతనెవరు.? అన్నదానిపై ఇటు రాజకీయ పార్టీలు, అటు పోలీసులు ఆరా తీస్తున్నారు.

అన్యం సాయి టీడీపీకి చెందిన వ్యక్తి.. అంటూ తొలుత వైసీపీ ప్రచారం చేసింది. ఆ తర్వాత జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్త.. అంటూ అన్యం సాయి గురించి వైసీపీనే ప్రచారం షురూ చేసింది. ఇంతలోనే, అన్యం సాయికి వైసీపీ ముఖ్య నేతలతో సంబంధాలున్నట్లు తేలింది.

ఏకంగా, వైసీపీ ముఖ్య నేత.. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అన్యం సాయి ఫొటోలు దిగిన వైనం సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. మరోపక్క, నాగబాబుతో అన్యం సాయి ఫొటోలు దిగినట్లుగా కూడా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అసలు, కోనసీమ అల్లర్లలో అన్యం సాయి పాత్ర ఏంటి.? అన్నది తేలకుండానే, అధికార వైసీపీ.. ఆ అన్యం సాయిని వివిద రాజకీయ పార్టీలకు అంటగట్టడమే పెద్ద తప్పిదం. ప్రభుత్వాన్ని నడుపుతున్న తాము ఆరోపణలు చేస్తే సరిపోదు, సరైన సాక్షాలతో ఆ విషయాన్ని నిరూపించాలన్న ఇంగితం ప్రభుత్వ పెద్దల్లో కొరవడటం ఆశ్చర్యకరమే.

వైసీపీకి వేరే శతృవు అవసరం లేదు. ఇలాంటి తొందరపాటు వ్యవహారాలతోనే వైసీపీ ప్రజల్లో పలచనైపోతోంది. విపక్షాలు కుట్రలు పన్నుతోంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందా.? అన్న విమర్శ ప్రజల నుంచి రాకుండా వుంటుందా.?