జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటన విషయంలో వైసిపి చంద్రబాబునాయుడుపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టింది. హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రదారి చంద్రబాబునాయుడే అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. హత్యాయత్నం ఘటనను వివరించటానికి, చంద్రబాబు వైఖరిపై ఫిర్యాదు చేయటానికి రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హత్యాయత్నంలో ఆరుగురి పాత్రను నేరుగా ప్రస్తావించారు.
అసలు సూత్రదారి చంద్రబాబు కాగా డిజిపి ఠాకూర్, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, టిడిపి ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు, సినీనటుడు శివాజిలు పాత్రదారులుగా స్పష్టంగా చెప్పారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో తన పాత్ర లేకపోతే స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించటానికి ఎందుకు చంద్రబాబు వెనకాడుతున్నారంటూ రాజ్యసభ ఎంపి సూటిగా ప్రశ్నించారు. ఘటనపై రాష్ట్రపతి లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా గనుక నిష్పాక్షింగా విచారణ జరిగితేనే వాస్తవాలేంటో బయటకు వస్తాయని చెప్పటం గమనార్హం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, విచారణపై విజయసాయి ఉదయం డిమాండ్ చేసినట్లే హై కోర్టు మధ్యాహ్నం స్పందించింది. విచారణలో ఒకవైపు జగన్ తరపు లాయర్ మరోవైపు అడ్వకేట్ జనరల్ తమ వాదనలను వినిపించారు. అయితే, జగన్ తరపు లాయర్ ముందు అడ్వకేట్ జనరల్ వాదన తేలిపోయింది. అంతేకాకుండా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దాంతో జగన్ లాయర్ వాదనతో ఏకీభవించినట్లైంది.
అందుకే జగన్ తన పిటీషన్లో చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగానే న్యాయమూర్తి కూడా చంద్రబాబు, డిజిపి, విమానాశ్రయ అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జగన్ డిమాండ్ చేస్తున్నట్లుగా హై కోర్టు గనుక సానుకూలంగా స్పందించి స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపించాలని ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఇదే అంశం ప్రధాన ప్రచారాస్త్రం అవుతుదనటంలో సందేహం లేదు.