జనసేన ‘గాజు గ్లాసు’పై సీఈసీకి వైసీపీ ఫిర్యాదు.!

జనసేన పార్టీ అంటే, వైసీపీ భయపడుతోందా.? లేకపోతే, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాసు’ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేయడమేంటి.? అదీ, ఎన్నికలకు రెండు మూడు నెలల ముందర వైసీపీ, ఇలాంటి హాస్యాస్పదమైన ఆలోచన ఎందుకు చేసినట్టు.?

వైనాట్ 175 అనే నమ్మకంతో వుంది వైసీపీ. అలాంటప్పుడు, జనసేన గురించి వైసీపీ అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు. అయితే, జనసేన – టీడీపీ కూటమి విషయమై వైసీపీలో కొంత ఆందోళన వుంది. ఈ నేపథ్యంలోనే, జనసేనను దెబ్బ కొట్టేందుకు, గాజు గ్లాసు గుర్తు విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

గుర్తింపుకి నోచుకోని జనసేన పార్టీకి, కొద్ది సీట్లలో మాత్రమే పోటీ చేసే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని కామన్ సింబల్‌గా ఎలా కేటాయిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదొక మైండ్ గేమ్ అయితే అయి వుండొచ్చుగాక. కానీ, ఇతర రాజకీయ పార్టీల గుర్తుల విషయంలో వైసీపీకి ఎందుకంత దురద.? అన్న చర్చ జనంలో గట్టిగా జరుగుతోంది.

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది.. చివరాఖరి ప్రయత్నంగా, గాజు గ్లాసు గుర్తు మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.. అనే సంకేతాన్ని వైసీపీనే స్వయంగా పంపుకుంది దురదృష్టవశాత్తూ.!

పైగా, గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. అంటూ వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో భేటీ అనంతరం వ్యాఖ్యానించడం మరింత హాస్యాస్పదం.

కాగా, వాలంటీర్లను, వార్డు అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల్నీ ఎన్నికల విధులకు దూరంగా వుంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన ఫిర్యాదు చేశాయి. టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో భేటీ అయ్యారు.