పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలక పార్టీలో హడావుడి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో స్టడీలు, లాబీయింగులు జోరుగా నడుస్తున్నాయి. హైకమాండ్ వీలైనంతవరకు ఏకగ్రీవాలు చేయాలని తీర్మానించి నాయకులకు ఆదేశాలిచ్చింది. పోటీ లేకుండా సర్పంచులను ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఈ బాధ్యతను ఎమ్మెల్యేల మీద పెట్టింది. ఈ ఏకగ్రీవాల ప్రధాన ఉద్దేశ్యం పార్టీలో అంతర్గత పోటీ లేదా బయట పార్టీల నుండి పోటీ లేకుండా చేసుకోవడమే. ఎమ్మెల్యేలు, ఎంపీలు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారట. వారిలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడ ఉన్నారట.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్ పదవుల ఎంపిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఆయన మాత్రం మండల అధ్యక్షులకు అప్పగించారట. దీంతో అధ్యక్షులు ఆశావహులను ముందుకురమ్మన్నారట. దీంతో పెద్ద సంఖ్యలో వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం పోటీకి దిగారట. వీరిలో గ్రామ స్థాయి నుండి జల్లా స్థాయి వరకు లీడర్లు ఉన్నారట. ప్రతి ఒక్కరూ ఎవరో ఒక పెద్ద లీడర్ నుండి సిఫార్సు తెచ్చుకున్నవారేనట. అందరికీ ఒక్కొక సపరేట్ గ్రూప్ ఉందట. ఇంతమంది ముందుకొస్తే వీరిలో ఒకే ఒక్కరిని మాత్రమే సర్పంచ్ పదవిలో కూర్చోబెట్టాలి. అప్పుడు మిగిలినవారు తీవ్ర అసంతృప్తికి లోనుకాక తప్పదు. అదే జరిగితే పార్టీలో తిరుగుబాటు ఖాయమని పార్టీ శ్రేణులు ఆందోళనపడుతున్నారట.
అసలు కడప జిల్లాలో వైకాపా శ్రేణులు నాయకుల మాటకు కట్టుబడే ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యేనే నేరుగా ఒకరిద్దరిని పదవికి కన్సిడర్ చేసి చివరికి ఒకరిని ఎంపిక చేస్తే ఆశావహులు, నిరాశతో వేనుదిరిగేవారు ఉండరు కదా, అసలు ఎమ్మెల్యే చేయాల్సిన పనిని మండల అధ్యక్షులు చేస్తుండటం ఏమిటి. ఈ చర్యల వలన అనవసరంగా పార్టీలో కొత్త గ్రూపులు, కొత్త రాజకీయాలు మొదలవుతాయని ఆందోళన చెందుతున్నారట. కాపా జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన జిల్లాల్లో పదవుల విషయంలో ఎన్నెన్ని రాజకీయాలు జరుగుతున్నాయో అని శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.