వైసీపీ పైకి నిండు కుండలా వైభంగా కనబడుతున్నా లోపాలు మాత్రం అలజడులు గట్టిగానే ఉన్నాయి. సొంత నేతల మధ్య వర్గ పోరు ఒక సమస్య అయితే కార్యకర్తల ఆవేదన ఇంకొక పెద్ద సమస్య. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రేణులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. కేవలం జగన్ ముఖం చూసి కాలాన్ని, ధనాన్ని వెచ్చించిన కార్యకర్తలు అనేకమంది ఉన్నారు. పార్టీని జనానికి దగ్గరచేయడంలో కీలక పాత్ర పోషించింది వారే. వారంతా జగన్ అధికారంలోకి వస్తే తాము బాగుపడ్డట్టే అనుకుని పనిచేశారు. ఇళ్లంతా గుల్ల చేసుకున్నారు. కానీ జగన్ సీఎం అయి రెండేళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ వారికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు.
తమ బాధలను లోకల్ లీడర్లతో చెప్పుకుందామంటే వినేవారెక్కడ. తమకే దిక్కు లేదని, ఇక మీ బాధలు ఎక్కడ తీరుస్తామని చేతులెత్తేశారు చాలామంది. దీంతో శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం, అధైర్యం నెలకొన్నాయి. మొన్నామధ్యన ఒక కార్యకర్త తనకు పార్టీలో అన్యాయం జరుగుతోంది అంటూ ఆత్మహత్య చేసుకోబోయాడు. నేతల్లో అసంతృప్తినైనా తట్టుకోవచ్చేమో కానీ శ్రేణుల్లో అసహనాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే పార్టీలోని సీనియర్ నేత, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
కార్యకర్తలు ఎంతటి ఆవేదనతో రగిలిపోతున్నదీ విజయసాయిరెడ్డి ముందు మొహమాటం లేకుండా చెప్పేశారట. ఇన్నాళ్లు చాలామంది లీడర్లు ఈ విషయాలను కోటరీ పెద్దల ముందు ప్రస్తావించాలంటే వెనక్కు తగ్గేవారు. చెబితే ఆ విషయం మాకు తెలియదా, మీ చేత చెప్పించుకోవాలా అంటూ ఎక్కడ కన్నెర్రజేస్తారోనని ఆలోచించేవారు. కానీ ధర్మాన కృష్ణదాస్ మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా ఉన్న వాస్తవాన్ని కుండబద్దలు కొట్టేశారట. దీంతో అవాక్కవడం మిగతా లీడర్ల వంతైంది. ధర్మాన చెప్పిన వాస్తవాన్ని అంగీకరించిన విజయసాయి ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లి కార్యకర్తలకు ప్రభుత్వంలో చోటు కల్పిస్తామని మాటిచ్చారట. ధర్మాన ధైర్యం చేయడంతో ఇన్నాళ్లకు తమ బాధ అధిష్టానానికి తెలిసింది అంటూ శ్రేణులు ఆనందపడుతున్నాయి.