తుస్సుమన్న వైసీపీ బస్సు యాత్ర.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బస్సు యాత్రలు’ షురూ చేసింది. సామాజిక సాధికార యాత్రలంటూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒకేసారి మూడు యాత్రలు షురూ అయ్యాయ్.

వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు ఈ యాత్రల్లో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ సమీకరణ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

రాజకీయాలు ఒకప్పటిలా లేవు. జనాన్ని సమీకరించాలంటే, రాజకీయ పార్టీలకు చాలా చాలా కష్టమైన వ్యవహారంగా మారిపోతోంది. కష్టమైన, అత్యంత ఖరీదైన వ్యవహారమైపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభలకే, జనాన్ని బలవంతంగా తరలించాల్సిన దుస్థితి.

ఇక, ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పాల్గొంటున్న యాత్రలకు జనాన్ని సమీకరించడం ఇంకెంత కష్టమవుతుంది.? పోనీ, ఇంతా చేసి.. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ప్రచారం అన్నట్టుందా.? అంటే, విపక్షాలపై విమర్శలకే ఈ యాత్రలు పరిమితమవుతున్నాయి. అదే అసలు సమస్య.

ఈమాత్రందానికి బస్సు యాత్రలెందుకు దండగ.? అన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. గతుకుల రోడ్లపై బస్సు యాత్రలు నానా కష్టాలూ పడుతున్నాయి. అది కాస్తా, వైసీపీ పాలనా వైఫల్యాల్ని ఈ బస్సు యాత్రలతోనే నిరూపించినట్లవుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు వేరు. అవి అమలవుతున్న తీరు వేరు.! పార్టీ ముఖ్య నేతల్లో, పార్టీ కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిర్లక్ష్యం వుందన్న చర్చ అంతటా జరుగుతోంది. ఈ బస్సు యాత్రల్లో ఆ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.