నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకి వైసీపీ ప్రచారం.!

వినడానికి ఇబ్బందికరంగా వున్నా ఇదే నిజం.! రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ.. ఓ ఖచ్చితమైన అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. లేకపోతే, నారా లోకేష్ పాదయాత్రకి వైసీపీ ఉచిత పబ్లిసిటీ ఇవ్వడమేంటి.? ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఒకరేమిటి.? వైసీపీ నుంచి దాదాపు అందరు నేతలూ, నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర గురించి నిత్యం ‘మితిమీరిన వ్యాఖ్యలు’ చేస్తూనే వున్నారు.

మామూలుగా అయితే, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం లైట్ తీసుకుని వుండాలి. వైసీపీ నేతలెవరూ, ఈ పాదయాత్రను పట్టించుకోనట్టే వ్యవహరించాలి. కానీ, మీడియాకెక్కాలనే కక్కుర్తి అనండీ, ఇంకోటేదన్నా అనండీ.. వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు.. నారా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడేందుకు.

అదే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతోంది. లక్షలు ఖర్చు చేస్తే వచ్చే పబ్లిసిటీ, ఇదిగో ఇలా వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల ఉచితంగా నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు లభిస్తోంది.

‘ప్రభుత్వం తరఫున సాయం..’ అన్నట్టుగా, ‘జీవో నెంబర్ వన్’ వివాదమొకటి. ఈ వివాదం, నారా లోకేష్ పాదయాత్రకు ముందుగానే బీభత్సమైన పబ్లిసిటీ.. అది కూడా ఉచితంగానే అందిస్తోంది.

మొన్నీమధ్యన తెలంగాణలో వైఎస్ విజయమ్మ మాట్లాడిన మాటలు, గతంలో వైసీపీ నేతలు పాదయాత్రల విషయమై చేసిన వ్యాఖ్యలు..  వీటన్నిటినీ టీడీపీ తెలివిగా వాడుకుంటోంది. ఇలాంటి వాడకాల్లో టీడీపీకి సాటి ఇంకెవరు.?