వైఎస్సార్సీపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెడుతుందా.?

ఏ రాజకీయ పార్టీ అయినా రోజు రోజుకీ బలపడాలనే ప్రయత్నిస్తుంది.. విస్తరణ కోసం ప్రయత్నిస్తుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇందుకు అతీతమేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం.. అనే భావన కూడా పెరుగుతోంది.

‘ఉమ్మడి తెలుగు రాష్ట్రం మళ్ళీ.. అనే ఆలోచన చేయాల్సి వస్తే.. అందులో మేమే ముందుంటాం..’ అని ఆ మధ్య వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదో యధాలాపంగా చేసినవి కావు.

ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ గాయబ్ అయిపోయి, భారత్ వచ్చి చేరిందో.. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ కాస్తా కాలగర్భంలో కలిసిపోయినట్లయ్యింది. తెలంగాణకి పేటెంట్ హక్కు తమదేనని చెప్పుకునే గులాబీ నేతలే తమ జెండా మీద తెలంగాణని తీసెయ్యాల్సి వచ్చింది.

సో, తెలంగాణ సెంటిమెంటుకి ఇకపై ఆస్కారం లేదు. తెలుగు రాష్ట్రాలు.. తెలుగు ప్రజలు.. తెలుగు నేల.. ఈ భావన ముందు ముందు మరింత పెరగనుంది. అలా పెరిగినప్పుడు, రాజకీయంగా తామూ తెలంగాణలో విస్తరించాలని వైసీపీ మాత్రం ఎందుకు అనుకోదు.?

ఖమ్మంలో టీడీపీ సభ సక్సెస్ అయ్యాక, తెలంగాణలో తమ ఉనికిపై వైఎస్సార్సీపీలోనూ చర్చ షురూ అయ్యింది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోనూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ, అలాగే నల్గొండ తదితర జిల్లాల్లోనూ తమ ఉనికి గట్టిగానే వుంటుందని వైసీపీ భావిస్తోంది.

ఏపీలో ఎటూ వైసీపీ అధికారంలో వుంది గనుక, అది ఆ పార్టీకి అదనపు అడ్వాంటేజ్. వైసీపీ గనుక తెలంగాణ వైపు చూస్తే, షర్మిల పార్టీ ఏమవుతుంది.?