వాహన మిత్ర సరే.! రహదారి మిత్ర సంగతేంటి.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకానికి సంబంధించి, లబ్దిదారులకు ఒక్కొక్కరికీ పది వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. తమది సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకున్నారు.

దుష్ట చతుష్టయంపై విమర్శలు, దత్త పుత్రడిపై సెటైర్లూ మామూలే. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే, తమ ప్రభుత్వం చేయగలిగినంతా చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, అంతకు మించి చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఈ క్రమంలో వైసీపీ అనుకూల మీడియా, లబ్దిదారుల ద్వారా వైఎస్ జగన్ సర్కారు మీద పొగడ్తల వర్షం కురిసేలా చేయడమన్నది సర్వసాధారణమైన విషయం. మరి, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లు, ఆ కారణంగా పాడైపోతున్న వాహనాల మాటేమిటి.? భారీ వర్షాలు, వరదలనేవి ప్రకృతి విపత్తుల్లాంటివే. వాటిని మనం ఆపలేం. కానీ, పాడైపోయిన రోడ్లను అయితే బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది కదా.?

గడచిన మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విషయమై పెద్ద పంచాయితీ నడుస్తోంది. జగన్ సర్కారు వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది కూడా. కానీ, రోడ్లు బాగుపడటంలేదు. ఇంకోపక్క వాహనమిత్ర లబ్దిదారులు కూడా తమ వాహనాలు పాడైపోవడం వల్ల తమ మీద ఆర్థిక భారం అనూహ్యంగా పెరుగుతోందని అంటున్నారు.

ప్రభుత్వం ఏడాదికి పదివేలు ఇస్తోంటే, చెత్త రోడ్ల కారణంగా తమ మీద ఏడాదికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ భారం పడుతోందని చెప్పే వాహనదారులూ లేకపోలేదు. మొత్తంగా చూస్తే, వైఎస్సార్ వాహన మిత్ర అనేది ఓ దండగమారి పథకంగా మారిపోతోంది. ఆ సొమ్ముల్ని రోడ్ల మీద ఖర్చు చేస్తే.. ఎంత బావుంటుంది.? ప్చ్, ఈ విషయమై ప్రభుత్వానికి సరైన సలహా ఇచ్చేవారే లేకుండా పోయారాయె.!