మీకు తెలుసా.? వైఎస్ విజయమ్మ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట. దాని పేరు వైఎస్సార్ సీమాంధ్ర పార్టీ అట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ఇవి రెండూ వేర్వేరు రాష్ట్రాల్లో వున్నాయ్. తెలంగాణ మీద అలకతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ నుంచి (తెలంగాణని వదిలించుకుని) ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
దాంతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు వైఎస్ షర్మిల. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు ఏం అన్యాయం చేసిందని.?’ అంటూ కొందరు బేలగా ప్రశ్నిస్తున్నారట, ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దాంతో, వైఎస్సార్ సీమాంధ్ర పార్టీ అని పెడితే బావుంటుందని వైఎస్ విజయమ్మ అనుకుంటున్నారట.
సోసల్ మీడియాలో జరుగుతున్న కామెడీ రచ్చ ఇది.! లోకల్ పార్టీలు జాతీయ రాజకీయాలు చేస్తున్న రోజులివి. తెలంగాణ, సీమాంధ్ర.. అంటూ ఈ లొల్లి ఏంటి.? అన్నది ఇంకొందరి వాదన. అయినా, కుమార్తెకు తెలంగాణలో అండగా నిలిచేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో కీలక బాధ్యతలు కూడా తీసుకోవాలనుకుంటున్న వైఎస్ విజయమ్మ, ఏపీలో ఎందుకు పార్టీ పెడతారు.?
పైగా, ‘ఏపీలో వైఎస్ జగన్‌ని ఎవరూ టచ్ కూడా చేయలేరు’ అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో వైఎస్ విజయమ్మ చెప్పారాయె.! వైఎస్సార్ పేరు పక్కన పెడితే, సీమాంధ్ర పేరుతోనో, ఆంధ్రప్రదేశ్ పేరుతోనో.. ముందూ వెనుకా తోకలు తగలించేసి ఏదో ఒక లోకల్ పార్టీ తగిలించెయ్యాలనే ప్లాన్స్ అయితే ఏపీలో జరుగుతున్నాయట. ఆంద్రప్రదేశ్ మీదకి బీఆర్ఎస్ రూపంలో గులాబీ పార్టీ దండయాత్రకు సిద్ధమవుతోంది గనుక, సీమాంధ్ర ఉనికి కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నది ఓ వాదన.
సరిపోయింది సంబరం.!