నవ్య సామాజిక వ్యవస్థకు రూపశిల్పి వైఎస్సార్!

ఆ నవ్వు అచలం

ఆ నవ్వు అమరం

ఆ నవ్వు అనురాగం

ఆ నవ్వు ఆప్యాయతా కుసుమం

ఆ నవ్వు అరివర్గ భయంకరం

ఆ నవ్వు ఆచంద్ర తారార్కం

అలాంటి నవ్వు తెలుగుజాతి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది… ఆ నవ్వు పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.

ఆ నవ్వు ఇప్పుడు భౌతికంగా లేదు. దివికేగిపోయింది. అయితేనేం తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా కొలువుతీరి ఉండిపోయింది. వైఎస్సార్ ఎంతటి మహనీయుడంటే… ఆయన ఆత్మ ఈ క్షణంలో ఏ ఊర్థ్వ లోకాల్లో ఉన్నాప్పటికీ అది ఖచ్చితంగా విలపిస్తూనే ఉంటుంది. కారణం… తనకోసం, తన జ్ఞాపకాలతో బోరున విలపిస్తున్న తెలుగు ప్రజల కన్నీళ్లను తాను స్వయంగా తుడవ లేకపోతున్నందుకు. అయితేనేం… తన బిడ్డకు ఆ బాధ్యత ఇచ్చారు తెలుగు ప్రజలు!

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం చాలా ఆలస్యంగా జరిగిందని ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల తెలుగు హృదయాలు కొన్ని వందల సందర్భాల్లో అనుకుని ఉంటాయి. ఇన్ని దశాబ్దాలుగా ఏలుబడి సాగించిన ఎంతోమందికి స్ఫురించని ఎన్నో పథకాలతో వైఎస్సార్ పేదల బాధలు బాపే ప్రయత్నం చేశారు. “కూడూ- గూడూ- గుడ్డా” అనే సగటు మనిషి ప్రాథమిక అవసరాల విస్తృతి పెంచి “విద్య – వైద్యం” అంశాల్లో కూడా నవ్య సామాజిక వ్యవస్థకు రూపశిల్పి వైఎస్సార్.

అలాంటి మహనీయుడిని ఈ సందర్భంగా స్మరించుకోవడం చాలా విశిష్టమైన సంగతి. ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎన్నటికీ పదిలంగా ఉంటుందని నమ్ముతూ…!!