వైఎస్ సోదరుడు వివేకానంద హత్య కేసులో రోజుకో నిజం బయటపడుతుంది. వివేక హత్యకు గురయ్యారని స్పష్టంగా కనిపిస్తున్న దానిని గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ శర్మ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే…
‘వైఎస్ వివేకానందారెడ్డి గుండెపోటుతో మృతి చెందారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి సెల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. కొంత సమయం తర్వాత అవినాష్ కార్యాలయంలో పనిచేసే భరత్‌రెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పులివెందుల ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు.
అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మన్ రంగన్న, ఇనయతుల్ల, శంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆసుపత్రిలో కంపౌండరుగా పనిచేసే ప్రకాశ్‌రెడ్డి, డా.నాయక్, అవినాష్‌రెడ్డితో పాటు మరో 20 మంది అక్కడ ఉన్నారు. వీరిలో కొంతమంది వివేకా రక్తపు వాంతులు చేసుకుని మరుగుదొడ్డి కమోడ్‌పై పడి గాయాలై చనిపోయారని పోలీసులకు వివరించారు.
అంతకు ముందే పడక గదిలోని రక్తపు మరకలు శుభ్రం చేసి ఉన్నాయి. పోలీసులు వెళ్లిన సమయంలో రక్తపు మరకలతో ఉన్న దుప్పటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. వివేకాకు తల, అరచేతిపై తీవ్ర గాయాలుండటంతో గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది ఆయన ఇంటికొచ్చి గాయాలకు కట్లు వేశారు. వివేకా మృతి చెందిన రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు రేంజి డీఐజీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మలను పిలిపించి మాట్లాడారు.
వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన పీఏ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని సునీత డీఐజీకి అందించారు. లేఖను ఉదయమే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదని డీఐజీ ప్రశ్నించగా.. డ్రైవరు ప్రసాద్‌కు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని భావించి తాము వచ్చేంత వరకూ ఆ లేఖను కృష్ణారెడ్డివద్ద ఉంచాలని చెప్పామని ఆమె తెలిపారు. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖలోని చేతి రాత ఆయనదేనని డీఐజీకి వివేకా కుమార్తె సునీత వెల్లడించారు’ అని ఎస్పీ వివరించారు.