వైఎస్ వివేకా హత్య వెనుక 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రూ.125 కోట్ల వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు.  మొత్తం వ్యవహారం అంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టునే ఉందని అంతా భావిస్తున్నారు. వారు నోరు విప్పితే అంతా బయట పడుతుందని చర్చించుకుంటున్నారు.

బెంగుళూరులో ఓ భూమి వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విబేధాలు తలెత్తాయని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు రెండు వారాల ముందే రెక్కీ నిర్వహించారని, ఈ డీల్ కు సంబంధించి రూ.1.50 కోట్ల లావాదేవిలు జరిగినట్టు గుర్తించారు. ఈ వివరాల పై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ లో తాము నష్టపోకూడదనే గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు చేతులు కలిపారని, హత్యకు నాలుగు రోజుల ముందు వివేకా ఇంట్లోని పెంపుడు కుక్కను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

వివేకానంద హత్య జరిగిన తర్వాత పోలీసులు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అదూపులోకి తీసుకున్నారు. వీరిని మరింత విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.