వివేకా హత్య : వివాదంగా ముదురుతున్న విషాదం

వివాదరహితుడి జీవితం ఒక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. బతికుండగా కుటంబ సంబంధ వివాదాలు తప్ప రాజకీయ వివాదాలను వైఎస్ వివేకానందరెడ్డి ఎపుడూ ఇంటికి తెచ్చిన సందర్బాలు లేవు. ఆయన జీవితంలో పెద్ద రాజకీయ వివాదమంటూ ఉంటే, ఆయనను కడప ఎంపి సీటుకు ఒక దఫా రాజీనామాచేయాలని ప్రయత్నించడం, కాంగ్రెస్ హైకమాండ్ వారించడమే.

అపుడు జగన్ ని లోక్ సభకు పంపాలని ఆయన చేత రాజీనామా చేయిస్తున్నారని ఒక చిన్న వివాదం వచ్చింది. అదిపూర్తిగా కుటుంబ సంబంధ వ్యవహారం.

 ఆ తర్వాత ఆయనను ప్రముఖంగా వార్తలకెక్కించిన విషయాలన్నీ కూడా కుటుంబానికి సంబంధించినవే. ఆయన జగన్ ను వ్యతిరేకించడం,వదిన విజయమ్మమీద పోటీ చేయడం, రాజకీయాలనుంచి దూరంగా పోవడం, మళ్లీ జగన్ దగ్గిరకు రావడం… ఇవన్నీ కుటంబ గోల మాత్రమే.

కుటుంబాన్ని రోడ్డు కీడ్చే వివాదాలు ఆయన సృష్టించలేదు. అయితే, ఇపుడు చనిపోయాక ఆయనే ఒక పెద్ద వివాదానికి సెంటర్ అయిపోయారు. పులివెందుల అంటేనే ఒక దుర్బేధ్యమయిన కోట. అందునా వైఎస్ ఇల్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కోటలోకి చొరబడి, ఇంట్లోకి దూరి, వైఎస్ సోదరుడయిన వ్యక్తిని నరికి హత్య చేయాలనుకోవడం చాలా అసాధారణ విషయం. ఇలాంటి హత్య రాయలసీమలో ఏ నాయకుడి ఇంట జరగలేదు.

నిన్న వైఎస్ వివేకా ‘మరణం’ వార్త ఇంకా పూర్తిగా వ్యాపించనేలేదు, అది వివాదమయింది.

రాజకీయాలు ఆంధ్ర తెలంగాణలలో ఎంత భ్రష్టుపడిపోతున్నాయో ఇటీవలి పరిణామాలు చెబుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, ఒక ప్రగతిశీల రాష్రం అని పేరుండేది. అయితే, ఇపుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సిగ్గులేని రాజకీయాలయిపోయాయి. రాజకీయాలు బిలియన్ కోట్ల రాబడి ఉన్న వ్యాపారం అయింది. రాజకీయాల్లో సంపాదించినంత సులభంగా మరే వ్యాపారంలో సంపాదించే అవకాశం లేకపోవడంతో కుళ్లంతా  రాజకీయాల్లోకి  వస్తున్నది.రాజకీయాలు మూసికంటే మురికిగా తయారయ్యాయి.

మూడుదశాబ్దాలికిందకు వెళితే, కొడుకులను కూతర్లను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు తల్లితండ్రులు జంకేవారు. అనాటి ముఖ్యమంత్రులెవరూ కొడుకులకు కూతర్లకు వారుసులుగా ట్రెయినింగ్ ఇవ్వలేదు. కారణం, రాజకీయాల్లో ఆస్తులు కరిగిపోవడమే తప్ప కలిసొచ్చేదేమీలేదని వారి అనుభవం. ఇపుడలా కాదు,పుట్టగానే కొడుకులను కూతర్లను క్రౌన్ ప్రిన్స్, క్రౌన్ ప్రిన్సెస్ లుగా  ప్రకటించేస్తున్నారు.

అంంతేకాదు, రాజకీయాధికారం నిలపుకునేందుకు ఏమయినా చేసేందుకు తెగిస్తున్నారు. తెగింపును కీర్తిస్తున్నారు. అధికారం శాశ్వతం చేసుకునేందుకు  ఎమ్మెల్యేలను కొంటున్నారు. లాభసాటి బేరానికి అమ్ముడుపోయేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. డబ్బుకోసం తామున్న పార్టీని  సర్వనాశనం చేసేందుకు చూస్తున్నారు.డబ్బు  అధికారం విలాసం కోసం ఏమయినా చేసేందుకు సిద్ధమవుతున్నారు.చావును పెళ్లిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న దౌర్భాగ్య దశలో ఉన్నాం.

వివేకా హత్య కు తెలుగు దేశం నేత చంద్రబాబు, కుమారుడు లోకేష్, మంత్రి అదినారాయణ రెడ్డి ఉన్నారు:విజయ్ సాయి రెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా మరణం మిస్టరీ అయింది. గంటలోనే ఆయన ‘గుండెపోటు మరణం’ దారుణ హత్య అయింది. గుండెపోటు అని చెప్పిన వారెవరు? అలా చెబుతున్నపుడు వొంటిమీద ఉన్ననరికిన గాయాలేమిటి? మొత్తానికి వివాదరహితుడి మరణం, గుండెపోటా, హత్యా అని తేలకముందే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు హత్యగా తేలక ముందే పరస్పర ఆరోపణలు,ప్రత్యారోపణలు  మొదలుపెట్టాయి. మధ్యాహ్నం ఎపుడో కడప ఎస్ పి ఇది హత్యే అధికారికంగా తేల్చారు. 

వివేకా జీవితం ముగింపు చాలా విషాదకరం.అయితే, అంతకంటే విషాదం వ్యాపార రాజకీయాలు లేదా రాజకీయ వ్యాపారాలు ఆయన మరణంలోకి ప్రవేశించడం.

వివేకా హత్య మీద లోతైన దర్యాప్తు చేసేందుకు, ‘దీని వెనక ఉన్న వాడు ఎంత పెద్ద మనిషయినా పట్టుకునేందుకు’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ వేశారు. ఇది రాజకీయ వాసన వేస్తున్నదని వైసిపి ఆరోపిస్తున్నది.

అసలు హత్యకుకారణం, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జమ్మలమడుగు మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటూ సిట్ మీద, దానిని పర్యవేక్షించే డిజిపి మీద మాకు నమ్మకమేలేదని జగన్ నేతృత్వంలోని వైసిసి తెల్చిచెప్పేసింది. ఈ హత్య మీద సిబిఐ విచారణ కావాలని ప్రతిపక్ష పార్టీ నేత జగన్ కోరుతున్నారు. ఇదే డిమాండ్ మీద ఈ రోజు జగన్ గవర్నర్ ను కలవబోతున్నారు. సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం ఎపుడో బహిష్కరించింది.రాష్ట్రంలో సిబిఐని కాలుపెట్టనీయమనింది టిడిపి ప్రభుత్వం.

హత్యకు కారణాలు కుటుంబంలోనే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు: ‘సతీష్ రెడ్డి, శాసన మండలి.మాజీ డిప్యూటీ చెయిర్మన్.

వైసిపి ఆరోపణలను ఖండిస్తూ అసలు హత్యకు కారణాలు ఇంట్లోనే ఉన్నాయని తెలుగుదేశం అంటున్నది. బాబాయ్ చావును రాజకీయాలకు జగన్ వాడుకుంటున్నాడని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.

వైఎస్ కుటుంబంలో అంతర్గత సమస్యలు ఉన్నాయని, దాని వలనే వివేకా మృతిచెంది ఉంటాడని పులివెందుల ప్రజలు వివేకా హత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు.

అంటే, హత్య కు కారణం వైఎస్ ఇంట్లోనే టిడిపి చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఇదే లైన్ తో సిట్ విచారణ సాగుతుందని వైసిపి అనుమానిస్తున్నది,అందుకే సిట్ వద్దు సిబిఐ కావాలంటున్నది.

ఈ ఆరోపణలను బట్టి స్ఫష్టమయిందేమిటంటే, ఒక వివాదరహితుడి జీవితం రాజకీయ వివాదమయింది. రెండు పార్టీల దోరణితో ఈ వివాదం పోలింగ్ బూత్ దాకా వెళ్లనుంది. పరస్పర విద్వేషం, అనుమానాల మధ్య హత్యం వెనక ఉన్న నిజం ఎప్పటికీ బయటకు రాదు, అది జానపద కథలాగ సోషల్ మీడియాలో జనం నోళ్లలో నానుతూ ఉంటుంది. ఇపుడిక నడచబోయే వివాదమంతా సిట్టా లేక సిబిఐయా అనేదే.