వివేకా డెత్ మిస్టరీ: సజ్జల పేరెందుకు తెరపైకొచ్చింది.?

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, వైసీపీ నేత అలాగే ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, ఆరోజు జరిగిన సంఘటనల గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారామె. ‘ఏ విషయమైనా సజ్జల
రామకృష్ణారెడ్డితో మాట్లాడాల్సిందిగా’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి తనకు చెప్పారన్నది సునీతా రెడ్డి ఆరోపణ.

వైఎస్ వివేకా మరణం తర్వాత భారతీ రెడ్డిని తాను కలిసినప్పుడు ఆమె కంగారులో వున్నారనీ, సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడాకే ఏ విషయమ్మీద అయినా మీడియాతో చెప్పాలని భారతీరెడ్డి తనకు సూచించినట్లుగా సునీతా రెడ్డి చెబుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పోస్టుమార్టమ్ సందర్భంగా ఓ లేఖ తనకు ఇచ్చి, దాని మీద సంతకం చేయాలని పలువురు వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారనీ, అది తన ప్రకటనగా మీడియాకి చూపించాలనుకున్నా, తాను ఒప్పుకోలేదని చెప్పారు సునీతా రెడ్డి.

టీడీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పమన్నారనీ, అప్పుడున్న పరిస్థితుల్లో అదే నిజమని తానూ నమ్మాననీ, ఆ తర్వాతే పలు అనుమానాలు తనకు కలిగాయనీ సునీతా రెడ్డి చెబుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని వివేకా కోరుకున్నారనీ, ఈ క్రమంలో తాను సైతం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికే వివేకాని రాజకీయ ప్రత్యర్థులు చంపి వుంటారని అనుమాన పడ్డానన్నారు సునీతా రెడ్డి.

భాస్కర్ రెడ్డి కుటుంబంతో తమకు దశాబ్దాలుగా వివాదాలు వున్నాయని సునీతా రెడ్డి ఆరోపించడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు తెరపైకి రావడమే ఆశ్చర్యకరం. ఎందుకిలా.?