వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: ఎన్నాళ్ళీ బ్లేమ్ గేమ్.!

వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఈ కేసు జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే. ఓ మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే.. ఆ కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఏళ్ళు గడుస్తున్నాయ్. అయినాగానీ, చంపిందెవరు.? చంపించిందెవరు.? అన్నది తేలలేదంటే, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థ కూడా ఏమీ తేల్చలేకపోయిందంటే.. అసలేం జరుగుతోంది దేశంలో.!

కేవలం రాజకీయ అవసరాల కోసం ‘వైఎస్ వివేకా డెత్ మిస్టరీ’ని ఓ పబ్లిసిటీ స్టంట్‌గా రాజకీయ పార్టీలు వాడుకునేందుకు దర్యాప్తు సంస్థలు అవకాశం కల్పిస్తున్నట్టుగా వుంది పరిస్థితి. అప్పట్లో.. అంటే, 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా డెంత్ మిస్టరీ.. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు ‘మాంఛి పబ్లిసిటీ మెటీరియల్’ అయిపోయింది.

అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదు. కాకపోతే, వైఎస్ వివేకా హత్య కేసు విషయమై టీడీపీ మీద గతంలోలా వైసీపీ ఆరోపణలు చేయలేకపోతోంది. ఎందుకు.? అంటే, దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ వైసీపీ విరుచుకుపడింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రధాన పబ్లిసిటీ అంశం ఇదే.!

కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మొన్నటికి మొన్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ వైసీపీ మీద టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడూ అదే తంతు. 2024 ఎన్నికల్లోనూ ఇదే అంశం టీడీపీకి ప్రధాన ఎజెండాలా మారేట్టుంది. ఇంతా జరుగుతోంటే, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థ ఏం చేస్తోంది.? మీడియాలో జడ్జిమెంట్ల తరహాలో వార్తా కథనాలు వస్తుండడం సంగతేంటి.?