2019 ఎన్నికల సమయంలో జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన వున్నప్పుడే హత్య జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. ఇంటికెళ్ళి సేద తీరిన క్రమంలో అర్థరాత్రి వేళ దుండగులు ఆయన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు.
రోజులు నెలలు కాదు, ఏకంగా సంవత్సరాలు గడిచిపోతున్నాయ్. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి. పైగా, ఆయన మాజీ మంత్రి.. మాజీ ఎంపీ కూడా.! అయినాగానీ, ఆయన హత్య కేసులో దోషులెవరన్నది ఇప్పటికీ తేలలేదు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ నానా రకాల రాజకీయాలూ నడిచాయి. ‘ఇది నారాసుర రక్త చరిత్ర’ అని వైఎస్ జగన్ స్వయంగా ఆరోపించారు. అంతలా ఆరోపణలు చేసి, ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మీద కేసులు ఎందుకు వైఎస్ జగన్ పెట్టించలేదన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
సీబీఐ విచారణ జరుగుతోన్నా, ఆ విచారణ కూడా సక్రమంగా ముందుకు నడవడంలేదు. ఈ కేసులో న్యాయపోరాటం చేసీ చేసీ అలిసిపోతున్నారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి. సీబీఐ విచారణ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించడం వల్లనే సాధ్యమయ్యింది. ఇప్పుడామే కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఇందుకు సుముఖంగానే వుందట.
వేరే రాష్ట్రంలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగితే ఏం మార్పు వస్తుంది.? ఏడాదిలోనో, రెండేళ్ళలోనో దోషులెవరో బయటపడతారా.? ప్చ్.. ఛాన్సే లేదన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.