మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీకి సంబంధించి సీబీఐ విచారణ జరుపుతున్నాగానీ, ఈ కేసులో ఇప్పటికీ దోషులెవరన్నది తేలలేదు. రోజులు, నెలలు కాదు.. ఏళ్ళు గడిచిపోతున్నాయ్! ఈ కేసులో కుట్ర కోణం సుస్పష్టం. గతంలో చంద్రబాబు మీద వైసీపీ ఆరోపణలు చేసింది. వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేసింది. చంద్రబాబు హయాంలో, 2019 ఎన్నికల సమయంలో జరిగిన దారుణ హత్య ఇది.
ఈ కేసులో సీబీఐ విచారణ కోరింది స్వయానా వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి. ఆ సీబీఐ విచారణ కూడా సజావుగా సాగడంలేదన్న విమర్శలున్నాయి. ఏపీలోని అధికార పార్టీకి చెందిన కొందరు, ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందుకు సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. తెలంగాణలోని సీబీఐ కోర్టకు ఈ కేసును బదిలీ చేసింది సుప్రీంకోర్టు.
అంతా బాగానే వుందిగానీ, ఈ కేసులో నిజా నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి.? అంత దారుణంగా వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు ఎవరు చంపాల్సి వచ్చింది.? 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఎందుకు ఈ కేసుని రాజకీయంగా వాడుకున్నాయి.? అప్పట్లో సీబీఐ విచారణ కావాలని, ఆ తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని వైఎస్ జగన్ ఎందుకు అన్నారు.? తొలుత గుండెపోటుగా ఎందుకు ఈ మర్డర్ మిస్టరీని అభివర్ణించాల్సి వచ్చింది.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
తెలంగాణలోని సీబీఐ కోర్టుకి కేసు విచారణ బదిలీ అయ్యాక అయినా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా.? వేచి చూడాల్సిందే.