వైఎస్ వివేకా అక్బర్..! వైసీపీ సెల్ఫ్ గోల్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు’ కూడా రాజకీయంగా కలిసొచ్చిందన్నది నిర్వివాదాంశం. రాజకీయాల్లో అంతే.! చంద్రబాబు హయాంలో హత్య జరిగిన దరిమిలా, ఆ హత్యకు కారకుడు చంద్రబాబేనని వైసీపీ, రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించగలిగింది.

రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేననుకోండి.. అది వేరే సంగతి. కానీ, చంద్రబాబుకి ఇప్పుడు అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై క్లీన్ చిట్ ఇచ్చేసింది. తాజాగా, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘కుటుంబ కలహాలతోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది’ అని తేల్చేశారు.

దానర్థం, వైసీపీ గతంలో చేసిన ‘నారాసుర రక్త చరిత్ర’ అబద్ధమని సాక్షాత్తూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సర్టిఫై చేసినట్లే కదా.! ‘ఇన్నాళ్ళూ నిజాలు దాచిపెట్టాల్సి వచ్చింది. వైఎస్ వివేకా కుటుంబం పరువు పోగొట్టకూడదనే మౌనంగా వున్నాను..’ అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. దాంతో, షేక్ మొహమ్మద్ అక్బర్‌గా వైఎస్ వివేకానందరెడ్డి పేరు మార్చుకున్న వ్యవహారం దగ్గర్నుంచి, అన్ని విషయాల్నీ టీడీపీ అనుకూల మీడియా సవివరంగా ప్రస్తావిస్తూ.. వైఎస్ కుటుంబంపై, ప్రజల్లో ఏహ్యభావం పెంచేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇక్కడ తప్పుకి అడ్డంగా దొరికిపోయింది కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా.

మరిప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఎలా.? వైఎస్ కుటుంబానికున్న విశ్వసనీయతను అవినాష్ రెడ్డి అత్యుత్సాహం దెబ్బ తీసిందా.?