వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. అన్న మాటని ఇక్కడ ప్రస్తావించుకోవాలి ముందుగా.! మొన్నేమో, పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకొచ్చింది.
ఆ తర్వాత, ఏకంగా వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నుంచి జగన్ మీద పోటీకి పులివెందుల నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనే ప్రచారమూ జరిగింది. తాజాగా, ఇప్పుడు వైఎస్ విజయమ్మ పేరుని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు కొందరు.
ఇంతకీ, వైఎస్ విజయమ్మ ఎక్కడ.? హైద్రాబాద్‌లో వున్నారా.? షర్మిల కోసం పులివెందుల వచ్చారా.? లేదూ, కుమారుడు జగన్ వెంట తాడేపల్లిలో వున్నారా.? ప్చ్.. ఈ విషయమై స్పష్టత లేదు.
గతంలో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేసి గెలిచిన మాట వాస్తవం. ఆ తర్వాత విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిందీ వాస్తవమే.! ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అసలు ఆమె ఏ పార్టీలోనూ లేరిప్పుడు.
కొన్నాళ్ళ క్రితం వరకూ ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు. ఆ పదవికీ, వైసీపీకీ రాజీనామా చేసి తన కుమార్తె షర్మిల వెంట తెలంగాణ రాజకీయాల్లో కొంత సందడి చేశారు. అయితే, షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో అసలామెకు సభ్యత్వమూ లేదు.
టెక్నికల్‌గా ఇదేమీ పెద్ద విషయం కాదు. కావాలంటే కాంగ్రెస్ సభ్యత్వమో, కాంగ్రెస్ పదవో వైఎస్ విజయమ్మకు తేలిగ్గానే వస్తుంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకి ఆ పవర్ వుంది. అంతకన్నా పవర్ వైసీపీ అధినేతగా వైఎస్ జగన్‌కి వున్నా, వైసీపీలో విజయమ్మకు జగన్ ఏ పదవీ ఇవ్వలేరు, ఇవ్వరు కూడా.! వున్న పదవినే పీకేశారు గతంలో.
అలాగని, తనయుడికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ రాజకీయం చేస్తారా.? ఛాన్సే లేదు.! మరి, ఈ ప్రచారమేంటి.? అంటే, ఇంకేముంది.. టీడీపీ అత్యుత్సాహం అంతే.!