వైసీపీకి విజయమ్మ గుడ్ బై.! వైటీపీ గౌరవాధ్యక్షురాలు కాబోతున్నార్ట.!

అద్భుతాలేం జరగలేదు.. వైఎస్ విజయమ్మ.. అంతా అనుకున్నట్టుగానే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు.. అనే పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఆమె నుంచి వైసీపీ గౌరవాధ్యక్షురాలు ఎంతమాత్రమూ కాదు.

ఇప్పుడు అధికారికంగా రాజీనామా చేశారుగానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక, అసలంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె వైసీపీ శ్రేణుల నుంచి తగిన గౌరవాన్ని అందుకున్నదే లేదనుకోండి.. అది వేరే సంగతి. కారణాలేవైతేనేం, వైఎస్ విజయమ్మ గత కొంతకాలంగాన తన కుమార్తె వైఎస్ షర్మిలతోనే వుంటున్నారు.

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించడం వెనుక, తెరవెనుక అన్నీ తానే అయి వ్యవహరించారు వైఎస్ విజయమ్మ. ఈ కారణంగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం భావం కాదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. వైసీపీ అధినేతగా వైఎస్ విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నాక, తగిన సమయం కోసం వేచి చూడక తప్పలేదు.

వైసీపీ ప్లీనరీ సందర్భంగా, ప్లీనరీ వేదికపైకి విజయమ్మను తీసుకొచ్చిన వైఎస్ జగన్, ఆ వేదిక సాక్షిగానే వైఎస్ విజయమ్మతో పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. దాంతో, కుటుంబంలో విభేదాలు.. అన్న మాటకు ఆస్కారం లేకుండా వైఎస్ జగన్ చేశారనుకోవాలేమో.

ఇదిలా వుంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీ)కి వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.