వైఎస్సార్.. తెలుగునాట ‘సంక్షేమ రారాజు’

సంక్షేమంతో కూడిన అభివృద్ధి.. ఇదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జపించిన మంత్రం. తెలుగునాట, కాంగ్రెస్ పార్టీకి సరికొత్త ఊపిరిలూదిన నాయకుడిగా ఎప్పటికీ వైఎస్సార్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి వుంటుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు, ‘బొటాబొటీ మార్కులే ప్రజలు మనకిచ్చారు. మనం మరింత సమర్థవంతంగా పని చేయాలి.. మరింత బాధ్యతాయుతంగా మెలగాలి..’ అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి నినదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ళు, జలయజ్ఞం విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చినా, నిధుల సమస్య ఎదురైనా, ఆరోగ్యశ్రీ అలాగే విద్యార్థుల ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పథకం.. తెలుగునాట సరికొత్త చరిత్ర అప్పట్లో.

ఆ సంక్షేమ మంత్రాన్ని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో యధాతథంగా కొనసాగించడం జరుగుతోందంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులపై సునిశితమైన రీతిలో విమర్శలు చేసినా, ఘాటైన సమాధానం చెప్పాల్సి వచ్చినా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ సంయమనం కోల్పోలేదు. పార్టీకి చెందిన ముఖ్య నేతలెవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే, వారిని హద్దుల్లో పెట్టేందుకు అవసరమైతే వారి మీద ‘రాజకీయంగా వేటు’ వేయడానికి కూడా వైఎస్సార్ వెనుకంజ వేయలేదు. మహిళను హోంమంత్రిగా నియమించినా, పాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చినా.. ఏం చేసినా వైఎస్సార్ ప్రత్యేకతే వేరు. ఆ వైఎస్సార్ ఫొటో.. కేవలం వైఎస్సార్ ఫొటోతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అదే ఫొటోతో తెలంగాణలో షర్మిల అధికార పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘వైఎస్సార్ వుండి వుంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయేది కాదేమో..’ అన్న చర్చ ఇప్పటికీ జరుగుతోంది. దటీజ్ వైఎస్సార్.