నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్టై ఇప్పటికి 6 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ స్పందించిన జగన్… నిడదవోలు సభలో నిప్పులు కక్కారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తికి కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకాలం చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని.. ఆయనను పలుకుబడి కలిగిన ముఠా కాపాడుకుంటూ వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టైంది అవినీతి కేసులో అని గుర్తుచేసిన జగన్… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సూత్రధారి, ఆ స్కాంలో పాత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో ఐటీ అధికారులు అతని పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని అన్నారు. దీన్ని కూడా కక్షసాధింపు చర్యగా చెబుతున్నారు.. కోర్టులో సుమారు పది గంటల పాటు వాదనలు జరిగిన అనంతరం రిమాండ్ కి పంపబడ్డారు అని జగన్ తెలిపారు.
ఇదే సమయంలో బాబుకు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సరైన ఆధారాలతో నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోలతో సహా అడ్డంగా దొరికినా, కొన్ని పత్రికల్లో, టీవీల్లో నిజాలు చూపించరని, ఆ పని సబబే అని సపోర్ట్ కూడా చేస్తారని దుయ్యబట్టారు. సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నవారంతా.. బాబు దొంగతనాల్లో వాటాదారులే అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు రిమాడ్ కి వెళ్లినా… ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పుకునే వ్యక్తి ప్రశ్నించడంటూ పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన జగన్… అవినీతి పరుడికే మద్దతిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని.. అవినీతిపై ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తారన్నారని జగన్ దుయ్యబట్టారు.
కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.. ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు, వినిపించదు.. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు.. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జగన్… బాబు దోచుకున్న సొమ్ములో వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరని అని అన్నారు.
ఈ సందర్భంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయం ప్రజలంతా ఆలోచన చేయాలని సూచించిన జగన్… “మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి.. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి.. మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మరింత మంచి పాలన అందిస్తాం” అని అన్నారు.