టీడీపీ మేనిఫెస్టోపై జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యర్థులపై విమర్శల విషయంలో దూకుడూ పెంచిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపైనా… ఆయన ప్రకటించిన తొలివిడత మేనిఫెస్టోపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల్లో విమర్శలు ఉండటంతోపాటు.. సామాన్యులను కదిలించే ఎమోషన్ ను కూడా జగన్ యాడ్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో జగన్ తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి.

మహానాడు వేదికగా ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలివిడత మేనిఫెస్టో అంటూ ఆరు హామీల ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టోపై టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు రాగా… సాధారణ ప్రజానికంలో అంత ఆసక్తి కనబరచకపోగా.. వైసీపీ నేతలు మాత్రం కాపీ పేస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేనిఫెస్టోపై తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.

కర్నూలు జిల్లా, పత్తికొండ బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్… “చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు.. పర్సనాలిటీ లేదు.. క్యారెక్టర్‌ లేదు.. క్రెడిబిలిటీ అంతకన్నా లేదు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.. ఏ గడ్డైనా తింటారు” అంటూ యతిప్రాశలతో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజమండ్రిలోని వేమగిరి వేదికగా జరిగిన మహానాడు ఒక మహాడ్రామా అని అభివర్ణించిన జగన్… వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అని కీర్తిస్తున్నారని ఎన్టీఆర్ ని ఉద్దేశించి అన్నారు.

అనంతరం… ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటూ ఊరించడం, ఆనాక గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడవడం బాబు పొలిటికల్ ఫిలాసఫీ అంటూ సీఎం ఫైర్ అయ్యారు. అసలు మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారో బాబుకు తెలుసా అని ప్రశ్నించిన జగన్… ప్రజలు గుండె చప్పుడుగా వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని అన్నారు. “మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టిందంటూ” సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో… బాబు మేనిఫెస్టో మన రాష్ట్రంలోనే పుట్టలేదని.. టీడీపీ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని జగన్ ఎద్దేవా చేశారు!